కరోనా మరింత కలవరపెడుతుంది. మారుతున్న మ్యూటేషన్లు.. కొత్త వేరియంట్లు శాస్త్రవేత్తలనే కాదు.. ఇటు వైద్యరంగాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. కర్ణాటకలో 425 మంది చిన్నారులకు కరోనా సోకటం.. కేరళలో రెండు డోసులు తీసుకున్న వారిలో 20 ,000 మంది వైరస్ బారీనపడటం చూస్తుంటే.. కొత్త వేరియంట్లు మనిషిలోని రోగనిరోదశక్తిని, యాంటీబాడీస్‌ను కూడా ఏమార్చుతున్నట్టుగా వైద్యనిపుణుల అంచనా వేస్తున్నారు. కేరళ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీల్లోనూ డెల్టా ప్లస్ కేసులు పెరుగుతున్నాయి. ఇవన్నీ చేతులారా చేసుకున్న తప్పిదమే కావచ్చు. ఎలా అంటారా.. రెండు నెలల క్రితం వరకూ రెండో వేవ్ చుక్కలు చూపింది. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు వైరస్ భారినపడ్డారు. పైగా… ఇంట్లో ఒక్కొకరికి ఒక్కో వేరియంట్ రావటం కొత్త మార్పుగా వైద్యరంగం భావించింది.
ఇప్పడు పరిస్థితి చూస్తుంటే.. ప్రజలు సాధారణ జీవనం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది మంచి పరిణామమే . కానీ.. ఎక్కడ నిబంధనలు పాటించట్లేదు. సోషల్ డిస్టెన్స్ సంగతి ఎలా ఉన్నా.. మాస్క్‌లు ధరించటం మానేశారు. పార్టీలు, విందులు, వినోదాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా యువత మాస్క్‌లు ధరించటాన్ని నామోషీగా భావిస్తున్నారు. ఇటీవల వైరస్‌కు గురైన వారిని పరిశీలించినపుడు.. వారికి ఇంట్లోని యువతీ, యువకుల ద్వారానే మహమ్మారి సోకినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా సోకుతున్న కేసుల్లో రెండో డోసు తీసుకున్న వాళ్లు ఉండటం.. వారి సంఖ్య 40,000 మందికి చేరటం మరింత గుబులు పుట్టిస్తుంది.