ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వంటి నేతలకు విచిత్ర వైఖరి. వ్యక్తిగతంగా ఎదిగిన ఇద్దరు నేతలు రెండు సామాజికవర్గాల్లో బలమైన ప్రాబల్యం ఉన్న నాయకులు. ఆ ఇద్దరూ ఒకేచోట ఉండటమే అసలు రచ్చకు కారణం. చీరాలలో ఇటీవల మత్స్యకారుల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. రాజకీయాలు కూడా ఇందులో మిక్స్ కావటంతో రచ్చరచ్చగా మారింది. చివరకు వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఎదుటనే పరస్పరం విమర్శలు చేసుకున్నారు. కోట్లాటకు దిగారు. చీరాలలో చేపలు పట్టేందుకు చిన్నకలువలలో నిషేధం ఉంది. అయినా అక్కడ ఓ వర్గం చేపలు పడుతుందనేది ఆరోపణ. అలా మొదలైన గొడవలు. చివరకు కరణం, ఆమంచి వర్గాలుగా మారి పోట్లాడుకునేంత వరకూ చేరింది. అసలే ఆమంచి, కరణం అంటే నిప్పు, ఉప్పుల్లా ఉంటారు. ఇద్దరి మధ్య రెండు దశాబ్దాలుగా ఆధిపత్య పోరు సాగుతోంది. ఎన్నికల్లోనూ ఇద్దరూ గెలుపుకోసం హోరాహోరీగా తలపడుతుంటారు. 2014లో వైసీపీ తరపున గెలిచిన ఆమంచి ఆ తరువాత టీడీపీలో చేరారు. మళ్లీ 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి సీటు తెచ్చుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో కరణం బలరాం నెగ్గారు. కానీ.. వైసీపీ అధికారంలోకి రావటంతో ఆమంచి పెత్తనమే సాగుతోంది. అప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల వ్యతిరేకంగా ఉన్న కరణం.. జగన్ సమక్షంలో వైసీపీ సర్కారుకు మద్దతు తెలిపారు. అప్పటి నుంచి కరణం, ఆమంచి వర్గాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి.
ఆమంచిని పార్టీ నుంచి పంపే కుట్ర మొదలైందనే గుసగుసలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పెద్దలు కూడా కరణం కు ప్రయార్టీ ఇస్తున్నారనేది ఆమంచి వర్గీయుల ఆందోళన ఈ నేపథ్యంలో కరణం అన్నీతానై చక్రం తిప్పుతున్నారు. ఆమంచి ప్రాముఖ్యతను తగ్గించేందుకు కొందరు వైసీపీ సీనియర్లు కూడా కరణంకు సహకరిస్తున్నారట. దీంతో ఆమంచిని ఒంటరిని చేసేందుకు ఇదంతా తెరచాటున పార్టీకు చెందిన సీనియర్లే చక్రం తిప్పుతున్నారట. దీనిలో భాగంగానే మొన్న ఎంపీ మోపిదేవి పర్యటనలో గొడవలుగా చెబుతున్నారు. ఇదంతా ఆమంచి కృష్ణమోహన్ చేయించిన పనిగానే చిత్రీకరించారట. మరి ఇది మున్ముందు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందనేది కాలమే నిర్ణయించాలి.