ఏపీ.. ఆంధ్రుల జీవనాడి. ప్రపంచాన తెలుగోడు లేని నేల లేదంటారు. ప్రపంచవ్యాప్తంగా అన్నిరంగాల్లో అంతగా పాతుకుపోయారు. ఇంతటి ప్రతిభా సంపన్నులైన ఆంధ్రులకు రాజధాని కలగానే మారుతోంది. దశాబ్దాల పాటు రాజకీయ చదరంగంలో పావుగా మిగిలిపోతున్నారు. అంతర్గత రాజకీయ విబేధాలు.. కుల, మతపరమైన వైషమ్యాలతో కొట్టుమిట్టాడాల్సి వస్తోంది.మద్రాసు నుంచి విడిపోయేందుకు.. ప్రత్యేక భాషా ప్రతిపత్తి రాష్ట్ర సాధనకు దీక్ష చేపట్టి పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ పుట్టింది. కర్నూలు రాజధానిగా కొంతకాలం మనుగడ సాగించింది. ఆ తరువాత.. ప్రకాశం, గుంటూరు మధ్య రాజధాని ఊగిసలాడి. చివరకు హైదరాబాద్ చేరింది. కాంగ్రెస్, టీడీపీ అన్ని పార్టీలు.. హైదరాబాద్‌ను కేంద్రంగానే భావించాయి. అప్పటికే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నా.. ఏపీలోనూ మరో నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏ ఒక్క నేతకు తట్టలేదు. ఆస్తులు, వ్యాపారాలు కూడబెట్టిన హైదరాబాద్ లోనే రాజధాని అనుకున్నారు. కానీ.. 2014లో ఉద్యమ ఫలితమో.. కాంగ్రెస్ రాజకీయ వ్యూహమో ఏపీ, తెలంగాణ విడిపోయాయి. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంటూనే.. తెలంగాణ నేతలు.. ఏపీ నాయకులతో రాష్ట్రం విడిపోయాక ఇంకెందుకు ఇక్కడ అంటూ తూలనాడటం.. ఆత్మగౌరవ పరీక్షగానే మారింది.
అదే సమయంలో చంద్రబాబు ఏపీ సీఎంగా ఏదో ఉద్దరిస్తాడనే ఏపీ ప్రజలకు ఓటుకు నోటు కేసులో తొలిసారిగా ఏపీ ప్రజలకు షాక్ తగిలింది. అంతే.. రాత్రికి రాత్రే అమరావతి రాజధానిగా ప్రకటించారు. దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మంచి నిర్ణయం అంటూ ప్రకటించారు. బాబు కూడా.. గ్రాఫిక్స్‌లో తాము నిర్మించబోయే అద్భుతరాజధాని అమరావతిగా కోట్లాదిరూపాయలు ప్రకటనలు, డిజైన్ల కోసం దారపోశాడు. ఐదేళ్ల వ్యవధిలో తాత్కాలికమంటూ భవనాలను సగంలోనే ఆపేశారు. పూర్తిగా చేస్తే.. జనం 2019లో తనను మరచిపోతారని అంచనా వేసుకున్నాడు. విజన్ 2020తో తానే రెండోదఫా ఏపీ సీఎంగా పగటి కలలు కన్నాడు. కానీ జనం మాత్రం రాజధాని, పోలవరం అంశాలను చంద్రబాబు పక్కదారి పట్టించారనే వాదన నమ్మారు. జగన్ కు జై కొట్టారు.
బారీ సీట్లతో సీఎంను చేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అమరావతికి తన ఓటు అంటూ జగన్ తొండాట ఆడారు. సరిగ్గా ఏడాది క్రితం మూడు రాజధానులంటూ విశాఖ, కర్నూలు, అమరావతి పేర్లను వెల్లడించారు. అమరావతి కేవలం శాసనసభకు మాత్రమే పరిమితమంటూ ప్రకటించారు. దీంతో 29 గ్రామాల అమరావతి ప్రాంత రైతులు 365 రోజులుగా ధర్నాలు, నిరసనలు చేస్తూనే ఉన్నారు.
టెంకాయ కొట్టి వెళ్లి ప్రధాని నరేంద్రమోదీ చాలా తెలివిగా.. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదేనంటూ చేతులెత్తేశారు. కానీ.. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం తూచ్.. మేం అమరావతికే కట్టుబడి ఉన్నామంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. జనసేనాని పవన్ కూడా అమరావతికే జై కొట్టారు. వైసీపీ సర్కారు మాత్రం.. అది అమరావతి కాదు.. కమ్మరావతి కాబట్టి.. అన్నిన కులాలను కలుపుకునే ప్రాంతాన్నే రాజధాని చేస్తామంటూ అమరావతికి తిలోదకాలిచ్చారు. చివరకుకోర్టుల వరకూ విషయం చేరటంతో ఏం చేయాలనేదానిపై అధికార, ప్రతిపక్ష పార్టీ తర్జనభర్జన పడుతున్నాయి. ఇలా .. కోర్టులు.. గొడవలతో రాజధాని లేకుండానే.. ఏపీ పాలన ఐదేళ్లు పూర్తిచేసుకుంటుందనేది వైసీపీపై ఉన్న ఆరోపణ. ఈ లెక్కన.. ఎన్నాళ్లయినా.. ఎన్నేళ్లయినా ఆంధ్రులకు శాశ్వత రాజధాని అనేది కలగానే మారుతుందేమో అనే ఆందోళన కూడా లేకపోలేదు.



