నువ్వు లక్ష కోట్లు తిన్నావంటే. నువ్వే రెండులక్షల కోట్లు తిన్నావంటూ పరస్పర విమర్శలు. సగటు మధ్యతరగతి మనిషి చిన్న ఇల్లు కట్టుకుని.. పిల్లల్ని చదివించుకునేందుకు నానా కష్టాలు పడుతున్నాడు. రేయింబవళ్లు చెమటోడ్చినా అప్పుల బాధ తీరట్లేదు. కానీ.. అప్పులు చేస్తూ రాజకీయం చేసిన నాయకుడు కుమారుడు ఒక్కసారిగా కోటీశ్వరుడు ఎలా కాగలిగాడు. ఒకటీ రెండు ఎకరాల రైతు ఇంటి నుంచి వచ్చి రాజకీయంగా ఎదిగిన పెద్దమనిషి అప్పుడే పుట్టిన మనుమడిని వందకోట్లరూపాయల అధిపతిని ఎలా చేయగలిగారు. ఇంద్రభవనాలను మించిన రాజసం ఉట్టిపడే మేడలు.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో ఎలా కట్టగలిగారు. నీతి, నిజాయతీ గురించి గంటల తరబడి మాట్లాడే ఈ ఉత్తమోత్తమ నేతల చీకటి గుట్టు బట్టబయలు చేసేందుకు న్యాయస్థానాలు కూడా సిద్ధమయ్యాయి. గుడినే మింగిన గురువుల బుద్దులు ఇలా.. ఉంటే.. వీరి అడుగుజాడల్లో నడచిన శిష్యులు ఇంకెంత ఘనాపాఠులు అనేది కూడా ఒకరోజు.. అటు.. ఇటుగా అయినా బయటపడతాయనేది కూడా నిష్టూరంగా అనిపించే నిజం.
నారా చంద్రబాబునాయుడు.. అక్రమాస్తులు కూడబెట్టారంటూ.. ఆ నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భార్య విజయమ్మ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. న్యాయకోవిధులను పెంచి పోషించిన చంద్రబాబు అప్పటికే ఎన్నో కేసులను వెకెట్ చేయించుకున్నాడు. అప్పుడు కూడా అదే చేశారు. తాజాగా మాజీ సీఎం ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టుకు చేసిన ఫిర్యాదును కూడా అప్పట్లో వెకేట్ చేశారు. ఇప్పుడు దానిపై విచారణ జరిపేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేయనుంది. దీంతో చంద్రబాబును దోషిగా.. లక్షల కోట్లు కూడబెట్టిన అవినీతి నాయకుడుగా ముద్రవేయాలనే ప్రత్యర్థులకు అవకాశం చిక్కినట్టయింది. ఒకవేళ చంద్రబాబు తన పదవులను అడ్డుపెట్టుకుని అడ్డంగా.. అది కూడా సక్రమమార్గంలోనే అక్రమంగా కూడబెట్టారని నిరూపించగలిగితే.. మరో శశికళ మాదిరిగా ఏపీలోనూ కొత్త రాజకీయం మొదలైనట్టుగానే భావించాలి. ఇప్పటికే ఏపీలో మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు ఈఎస్ ఐ స్కామ్‌లో అరెస్టయి బెయిల్‌పై వచ్చారు. కొల్లు రవీంద్ర వైసీపీ లీడర్ హత్యకేసులో నిందితుడుగా జైలుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా రవాణాశాఖను మోసగించిన కేసులో జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. ఇదే దారిలో టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా తారుమారైతే టీడీపీ పరిస్థితి ఏమిటనేది
తెలుగు తమ్ముళ్లను కలవరపాటుకు గురిచేస్తుందట.
వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో రోజూ విచారణ జరిపేందుకు సీబీఐ కోర్టు సిద్ధమైంది. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల విచారణను ఆపలేమంటూ స్పష్టంచేసింది. దసరా సెలవుల తరువాత తమ కేసు విచారణ చేపట్టాలన్న జగన్ తరపు న్యాయవాదుల అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఆన్‌లైన్ ద్వారా విచారణకు సుముఖత తెలిపింది. జగన్ అక్రమాస్తుల కేసులో 16 కేసుల విచారణ ప్రారంభించారు. కొన్ని కేసుల్లో హైకోర్టు మధ్యంతర అదేశాలు ఉండటంతో వాటి వరకూ నవంబరు రెండోవారం నుంచి విచారణ చేపట్టనున్నారు. పెన్నా సిమెంట్స్, ఇందూ సిమెంట్స్ హెటిరో, జగతి, రాంకీ హిందూ టెక్ తదితర కేసుల విచారణ కూడా ప్రారంభించారు. వీలైనంత తక్కువ సమయంలో జగన్ కేసులను కొలిక్కి తీసుకురానున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని గుడ్ గవర్నెన్స్ ఫోరం ఎంపీ, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ ప్రారంభించాలంటూ మరో వాజ్యం దాఖలు చేశారు. ఈ లెక్కన.. మాజీ సీఎం, తాజా సీఎంలతోపాటు.. అక్రమాలతో కోట్లు కూడబెట్టిన ఎన్నో ఖద్దరు అనకొండలు బయటకు వస్తాయనేది ఆసక్తిగా మారింది.