ఇద్దరూ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో కొడుకు బాధితులుగానే ఉన్నారు. మంత్రులుగా అయ్యల పలకుబడి కొడుకులు సొమ్ము చేసుకోవటమో.. వివాదాస్పద కామెంట్స్‌తో చివరకు జనంలో పలుచన కావటమో జరిగాయన్నమాట. ఇంతకీ.. అసలు విషయం ఏమిటంటే.. ఏపీ మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్ చుట్టూ బెంజ్‌కారు వివాదం ప్రభుత్వానికి ఇరకాటంగా మారింది.
ఒకసారి ప్రవచనం చెబుతున్న చాగంటి వారు తన ప్రసంగంలో ఒక మాట సెలవిచ్చారు. గత జన్మలో శత్రుత్వం తీరని ప్రత్యర్థులు కొడుకులుగా పుడతారని దాని సారాంశం. ఎక్కడో అరకొర ఉంటారు కానీ అందరూ అలాకాదనే వారూ లేకపోలేదు. కానీ.. నేతల సుపుత్రులను చూస్తే.. సారీ.. కొందరి పెత్తనం చూస్తే.. నిజమే అనిపించకమానదు. పుత్రుల దెబ్బకు.. పదవులు పోగొట్టుకున్న నేతలున్నారు. అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకున్నవారూ లేకపోలేదు. ఏమైనా.. మరోసారి ఏపీ రాజకీయాల్లో కొడుకుల పెత్తనం.. తమ్ముళ్లే షాడో ఎమ్మెల్యేలుగా పెత్తనం చెలాయిస్తున్న ఘటనలూ లేకపోలేదు. లోకల్ పాలిటిక్స్‌లో బార్యల చాటున భర్తల పెత్తనం కూడా కొత్తేమీ కాదు. కొద్దిసేపు ఇవన్నీ పక్కనబెడితే.. గుమ్మనూరు జయరాం.. ఏపీ కార్మికశాఖ మంత్రి కొడుకుచుట్టూ రాజకీయం వేడేక్కుతుంది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన అవినీతి ఆరోపణలు మరింత హీటెక్కిస్తున్నాయి. ఈఎస్ఐ స్కామ్‌లో నిందితుడు కార్తీక్.. ఖరీదైన బెంజ్ కారు మంత్రి కొడుకు గారికి కొనిచ్చాడనేది ప్రధాన ఆరోపణ. బెంజ్ పుణ్యమాంటూ మాటల యుద్ధం గట్టిగానే జరుగుతుంది.
మాజీ మంత్రి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయంటుంటే.. తాజా మంత్రి జయరాం మాత్రం.. ఇదంతా తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర అంటూ కొట్టిపారేశారు. తన కొడుక్కు ఉన్న లక్షల మంది ఫ్యాన్స్‌లో ఎవరైనా కారు కొని తిప్పమని అడిగితే తప్పా! అంటూ ప్రశ్నించారు. ఏమైనా.. అవినీతి ఆరోపణలతో అదే కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. ఇప్పుడు కార్మికశాఖ మంత్రి జయరాంపై ఆరోపణలూ రావటంతో ఏపీ సర్కారుకు ఇది సంకటంగా మారిందట. ఒకప్పుడు అయ్యన్న కూడా.. సన్‌స్ట్రోక్ బాధితుడే కావటం కొసమెరుపు. నిజానికి.. ఏపీ నేతలకు కొడుకుల బెడద తరచూ రాజకీయ వివాదాలకు కారణమవుతూనే ఉండటం కాలమహిమే అనాలేమో.
గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు రావెల కిషోర్‌బాబు, బోండా ఉమా, చింతకాయల అయ్యన్నపాత్రుడు , కోడెల శివప్రసాద్ తదితర వారంతా కొడకుల పెత్తనంలో కుదేలయ్యారు. రావెల తనయుడు హైదరాబాద్‌లో పోలీసు కేసులు ఎదుర్కొన్నారు. బోండా ఉమా వారసులైతే రేసింగ్‌లతో ఓక నిండుప్రాణం పోయేందుకు కారకులయ్యారు. చింతకాయల తనయుడు విజయ్ అయితే.. ఏకంగా ఇతర కులాలపై నోరు పారేసుకుని తండ్రి ఓటమికి ముందుగానే బాటలు వేశాడనే అపవాదు మూటగట్టుకున్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు వారసులు సత్తెనపల్లిలో కే ట్యాక్స్ వసూలు చేశారంటూ వైసీపీ అధికారం చేపట్టాక నానా రాద్దాంత చేశారు. తనయుడు కోడెల శివరామకృష్ణ పై పదులు సంఖ్యలో పోలీసులు కేసులు నమోదుచేశారు. అసెంబ్లీలో వస్తువులు కూడా గుంటూరులోని కోడెల తనయుడి ఆటోమొబైల్ షోరూంలో స్వాధీనం చేసుకున్నారు. రాజకీయంగా గొప్పగా పల్నాటిపులి అని ప్రశంసలు అందుకున్న కోడెల శివప్రసాద్‌రావు చివర్లో అవినీతి ఆరోపణలు శాపంగా వెంటాడటంతో భరించలేక ఆత్మహత్య చేసుకున్నారనేది టీడీపీ శ్రేణుల ఆవేదన. ఈ లెక్కన.. సుపుత్రులున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రత్యర్థుల కంటే సుపుత్రుల వల్లనే రాజకీయ ప్రాభవం కోల్పోతున్నారనేది బహిరంగ రహస్యం.