బాబు డైరెక్ష‌న్‌.. ర‌మేష్ యాక్ష‌న్‌.. జ‌గ‌న్ ఎమోష‌న్‌!

అప్పుడు మేం ఎస్ అంటే మీరు నో అన్నారు. ఇప్పుడు నువ్వు ఎస్ అంటే మేం కూడా ఎస్ అనాలా! ఇదీ ఇప్పుడు ఏపీలో లోకల్ ఎన్నిక‌ల‌పై వైసీపీ అంత‌రంగం. నిజ‌మే.. నువ్వు ఒకటంటే మేం ప‌ది అన‌గ‌లం. అంతేగానీ ఎన్నిక‌ల సంఘ క‌మిష‌న‌ర్‌గా మీరేది చెబితే అది చేసేందుకు చేతులు క‌ట్టుకుని ఉంటామ‌ని అనుకోవ‌ద్దంటూ వైసీపీ నేత‌లు చెబుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల‌కు విరుద్ధంగా త‌న‌కు అధికార బిక్ష పెట్టిన చంద్ర‌బాబు డైరెక్ష‌న్‌లో నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ న‌డ‌చుకుంటున్నారంటూ వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ విష‌యంలో వైసీపీ స‌ర్కారు మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఎన్నిక‌ల సంఘానికి స‌హ‌క‌రిస్తుంద‌నే భ‌రోసా లేదు.

ఏపీలో స్థానిక ఎన్నిక‌ల‌కు మార్చిలో జ‌ర‌పాల్సి ఉంది. వైసీపీ కూడా దీనికి త‌గిన‌ట్టుగా ఏర్పాట్లు చేసుకుంది. వీలైనంత వ‌ర‌కూ ఏక‌గ్రీవం చేసుకుంది. కానీ క‌రోనా కార‌ణంగా ఎన్నిక‌లు వాయిదా వేస్తూ ఎన్నిక‌ల సంఘం ఏక‌ప‌క్ష నిర్ణ‌యంపై వైసీపీ ప్ర‌భుత్వం అగ్గిమీద గుగ్గిల‌మైంది. ఆ త‌రువాత చోటుచేసుకున్న ప‌రిణామాలు ఎన్నిక‌ల సంఘం, రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్య దూరాన్ని పెంచ‌ట‌మే కాదు. నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేస్తున్నార‌నేంత అబాండం వేస్తున్నారు మంత్రులు. ఇప్పుడు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఏర్పాటు చేస్తున్న స‌మావేశంలోనూ ఇదే విష‌యం వెల్ల‌డించాల‌నే నిర్ణ‌యంలో ఉన్నార‌ట‌.

ఏపీలో లోక‌ల్ ఎన్నిక‌ల‌కు ఎన్నిక‌ల సంఘం సిద్ధ‌మైంది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా 40 ల‌క్ష‌ల రూపాయ‌లు మంజూరు చేసింది. ఇక్క‌డే అస‌లు గొడ‌వ మొద‌లైంది. క‌రోనా కేసులు పెరుగుతున్న‌పుడు ఇలా ఎన్నిక‌లంటూ ప్ర‌క‌టించ‌టం ప్ర‌జారోగ్యంపై ప్ర‌భావం చూపుతుంద‌ని వైసీపీ వాద‌న‌. పాఠ‌శాల‌లు తెరిచేందుకు, మాల్స్‌, సినిమా హాల్స్‌కు అనుమ‌తి ఇచ్చిన‌పుడు క‌రోనా సోక‌దా! అంటూ విప‌క్షాల ఎదురుదాడి. పైగా కొత్త‌గా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ఇవ్వ‌టం వ‌ల్ల గ‌తంలో ఏక‌గ్రీవం చేసుకున్న గ్రామ పంచాయ‌తీలు, ఎంపీటీసీ. జ‌డ్పీటీసీలు అన్ని గాల్లో కొట్టుకు పోతాయి. తిరిగి మ‌ళ్లీ వాటికి ఎన్నిక‌లు జ‌ర‌పాల్సి వ‌స్తుంది. ఇప్ప‌టికే ఏక‌గ్రీవం కోసం ల‌క్ష‌లు ఖ‌ర్చుపెట్టిన వారి ప‌రిస్థితి ఏమిట‌నేది మ‌రో ప్ర‌శ్న‌. ఇలా.. విప‌క్షాలు, ఎన్నిక‌ల సంఘం ఓ వైపు. అధికార పార్టీ మ‌రో వైపు లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్‌పై త‌మ బాణీ వినిపిస్తున్నాయి. మ‌రి ఈ బంతి చివ‌ర‌కు ఎటు చేరుతుందో.. ఎవ‌రికి లాభం
తెచ్చిపెడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here