రాజేంద్రనగర్ ప్రాంతం.. మధ్యాహ్నం 1 గంట సమయం. అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు కారులో నుంచి బయటకు దిగారు. రెప్పపాటులో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి.. కారులో పడేసుకుని తుర్రుమన్నారు. హైదరాబాద్ ఎక్సైజ్ కాలనీకు చెందిన డెంటిస్టు డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ నకు గురయ్యాడు. హిమాయత్‌సాగర్ వైపు వెళ్లినట్టుగా సీసీ కెమెరాల్లో ఆనవాళ్లు గుర్తించారు పోలీసులు. సీసీ కెమెరాల్లో లభించిన ఆనవాళ్లు ఆధారంగా హైదరాబాద్ పోలీసులు అనంతపురం జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో ఆ జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు సిబ్బందిని ఎలర్ట్ చేశారు. అన్ని చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. తెల్లవారు జాము సమయంలో అనంతపురం మీదుగా బెంగళూరు వెళ్లున్న జీవును నిలిపివేశారు. కిడ్నాప్‌గ్యాంగ్ ను గుర్తించారు. ఇద్దరు అగంతకులు పరారయ్యారు. మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రాఫ్తాడు పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులున్నట్టు సమాచారం.
ఆ తరువాత డాక్టర్ హుస్సేన్ నుంచి పోలీసులు కొంత సమాచారం రాబట్టారు. మంగళవారం మధ్యాహ్నం కొందరు తనను కిడ్నాప్ చేసినట్టు చెప్పారు. ఆ తరువాత ఓ గదిలో బంధీగా ఉంచి చిత్రహింసలకు గురిచేసినట్టు వెల్లడించారు. రూ.10 కోట్లు కావాలని డిమాండ్ చేయటంతో అంగీకరించలేదని.. దీంతో కాళ్లు చేతులు కట్టేసి తీసుకెళ్లినట్టుగా చెప్పారు. అయితే కిడ్నాప్ వెనుక వాస్తవాలు ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్తి పంపకాలు, కుటుంబ విబేధాలపై ఆరా తీస్తున్నారు. కిడ్నాపర్ల నుంచి తుపాకీ, మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంతటి కట్టుదిట్టమైన భద్రత ఉన్న హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఒక డాక్టర్‌ను అగంతకులు కిడ్నాప్ చేయటం సంచలనంగా మారింది. సుపారీ గ్యాంగ్‌ల ఆగడాలు కూడా పెరగటంతో ఆందోళన నెలకొంది.