ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే అంటే ఇదేనేమో. లేకపోతే.. సొంతపార్టీను దిక్కరించి.. పక్కపార్టీలో ముఖ్యంగా అధికార పార్టీల వైపు పరుగులు పెట్టారు. అంతా తామే అనుకున్నారు. కానీ ఊహించని ఝలక్‌తో ఉలిక్కిపడ్డారు. తమను కాపాడే వారెవరంటూ దిక్కులు చూడాల్సిన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదంతా కాలమహిమా.. కలికాల ప్రభావమా అనేది పక్కనబెడితే.. రాజకీయ చదరంగంలో వీళ్లంగా పావులుగా మారారు. వారి రాజకీయ భవితవ్యంపై అయోమయంలో పడాల్సిన పరిస్థితికి చేరారు. ఒక రాపాక.. మరో వల్లభనేని.. ఇంకో ఆమంచి.. చివరకు ఆర్ ఆర్ ఆర్.. వీళ్లంతా సొంతపార్టీకు జల్లకొట్టి.. పక్కపార్టీల వైపు చూడటమే పెద్ద తప్పుగా మారింది. అదెలా అంటారా..
వైసీపీ రెబెల్ ఎంపీగా రఘురామకృష్ణంరాజు పార్టీకు కంటగింపుగా మారాడు. పోన్లే ఆయన బాధ ఆయన పడతాడని వదిలేస్తే.. ఢిల్లీలో కూర్చుని ఇటు సీఎం జగన్‌ను.. అటు విజయ సాయి రెడ్డిని మాటలతో పొడుస్తున్నాడు. జగన్ అంటేనే మండిపడే మీడియాకు మాంచి విందు పంచిపెడుతున్నాడు. తనను ఏం చేయ లేరంటూ సవాల్ కూడా విసిరాడు. దీనికి బలాన్నిస్తూ.. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కూడా పూర్తి భద్రతను కల్పించింది. వైసీపీ కూడా ఆచితూచి స్పందిస్తుంది. అందరూ రఘురాముడు వెనుక నరేంద్రమోదీ ఉన్నాడనే అభిప్రాయం మరింత బలపడింది. ఇటువంటి సమయంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 828.17కోట్ల రుణం ఇతర అవసరాలకు వాడుకున్నారనే ఆరోపణలతో ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ సంస్థలపై సీబీఐ ఏకకాలంలో పలు రాష్ట్రాల్లో సోదాలు జరిపింది. కేసు కూడా నమోదు చేసింది. అంతే ఒక్క దెబ్బకు రాజుగారి పరపతి తుస్సుమనేంతగా దిగజారింది. మొన్న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ప్రధాని మోదీతో 40 నిమిషాలు బేటీ అయ్యారు. ఈ కలయికపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. టీడీపీ నేతలను కేసుల్లో ఇరికించటం ఖాయమంటూ గుసగుసలూ వినిపించాయి. కానీ.. అది కాస్త ఊహించని విధంగా రఘురామ కృష్ణంరాజు వైపు తిరిగింది. మరి మున్ముందు రాజుగారి పరిస్థితి ఎలా ఉండబోతుందనేది ప్రశ్నార్ధకంగా మారింది.
గన్నవరంలో వల్లభనేని వర్సెస్ యార్లగడ్డ రచ్చ బజారుకెక్కింది. ఇద్దరూ కలసి పనిచేయాలంటూ జగన్ సూచించటంతో సయోధ్య కుదిరింది. అయితే ఇది ఎంతవరకూ ఉంటుంది.. అసలు వీరిద్దరు కలసినా నియోజకవర్గంలో కార్యకర్తలు ఎలా ఉండబోతున్నారనేది మరో సమస్య. మరి మూడో వర్గ నేత దుట్టా వర్గీయుల పరిస్థితి ఏమిటనేది మరో సమస్య. అధికార పార్టీలో ఉన్నా సవాళ్ల నుంచి వంశీ తప్పించుకోలేకపోతున్నారు. ఐదేళ్లపాటు టీడీపీలో ఎదురుగాలి వీచినా భరించారు. ఇప్పుడు జగన్ నీడలో నియోజకవర్గంలో హవా కొనసాగించాలనే ప్రయత్నంలో ఉన్నా.. ఇక్కడా అదే పరిస్థితి. ఇప్పుడేం చేయాలో అర్ధంకాని పరిస్థితిలో వల్లభనేని తెలియని వైరాగ్యం కనిపిస్తుందంటున్నారు అభిమానులు.
ప్రకాశం జిల్లాలో అమంచి కృష్ణమోహన్ హవా వేరు. తనకంటూ ఉన్న జనబలంతో ఏ పార్టీలో ఉన్నా గెలువగలననే ధీమా 2019లో ఊహించని విధంగా దెబ్బతీసింది. అయినా.. తాను అధికారపార్టీలో ఉన్నాననే ధైర్యంగా ఉన్నారు. కానీ.. కరణం బలరాం వైసీపీ వైపు మొగ్గుచూపడటంతో అమంచి వేగానికి బ్రేకులు పడినట్టయింది. అంతమాత్రా.. అక్కడ కరణం పెత్తనం కూడా
అంతగా కనిపించట్లేదు. రాజోలు నుంచి జనసేన గుర్తుపై గెలిచిన రాపాక వరప్రసాద్ కూడా వైసీపీ తన పార్టీ అంటూ బహిరంగంగా ప్రకటించారు. జగన్ సారథ్యంలోనే తాను పనిచేస్తానంటూ పవన్ కళ్యాణ్ గురించి దారుణంగా మాట్లాడారు. జనసేన మునిగిపోయే నావలాంటిదంటూ చాలా కామెంట్స్ చేశారు. తన సొంతబలంతోనే గెలిచానంటూ కూడా జనసైనికుల విమర్శలకు బదులిచ్చారు. ఇప్పుడు జనసైనికులూ దూరంగా ఉంటున్నారు.. వైసీపీ నేతలూ దగ్గరకూ రానివ్వట్లేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. సొంతపార్టీ జెండాతో గెలిచిన.. వీరంతా ఏదో ఆశించి.. ఇంకేదో ఊహించుకుని గోడదూకినా మోకాలి దెబ్బలు తప్ప లాభం ఏమీలేదంటూ సదరు నేతల అనుచరులు గగ్గోలు పెడుతున్నారట.



