తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాడు. దూకుడు పెంచి హిందువుల ఓట్లే లక్ష్యంగా ప్రచారంలో దూకుడు పెంచారు. ఎంఐఎం తమ ప్రత్యర్ధి అని చెప్పటం ద్వారా టీఆర్ ఎస్‌కు పరోక్షంగా చెక్ పెట్టారు. గత ఎన్నికల్లో టీఆర్ ఎస్, ఎంఐఎం మధ్య మైత్రిని ప్రస్తావిస్తూనే పథకం ప్రకారం స్పందిస్తున్నారు. ఎంఐఎం బరిలో ఉన్న చోట టీఆర్ ఎస్ అభ్యర్థులున్నారు. అక్కడ హిందువుల ఓట్లను చీల్చటం ద్వారా ఎంఐఎంకు లబ్ది చేకూరుతుందనేది వాదన. దీనికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనూ బండి తాము బరాబర్ హిందు పార్టీ నేతలమంటూ ప్రకటించారు. దీనిలో భాగంగానే హైదరాబాద్‌లో ఉన్న పాకిస్తానీయులు, రొహింగ్యాలను బయటకు పంపేందుకు సర్జికల్ స్ట్రయిక్ చేస్తామంటూ హెచ్చరించారు. నిజానికి రొహింగ్యాలు వేలాది మంది అక్రమంగా నగరంలో తిష్టవేశారు. వీరికి రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు కూడా రావటంపై పోలీసులు పలుమార్లు కేసులు కూడా నమోదుచేశారు.
ఇటువంటి సమయంలోనే బండి చేసిన వ్యాఖ్యలు కాస్త కటవుగా ఉన్నా హిందుఓటర్లపై గట్టిగానే ప్రభావం చూపుతాయనే వాదన లేకపోలేదు. సర్జికల్ స్ట్రయిక్ పదం చాలా పెద్దదిగా.. దాన్ని వాడ కుండా ఉండాల్సిందనేది బీజేపీలోని కొందరు సీనియర్ నేతల సూచన. దీన్ని అవకాశంగా మలచుకున్న ఎంఐఎం, తెరాస రెండూ కూడా.. బీజేపీ మతపరమైన పార్టీ అంటూ ప్రచారం చేస్తున్నాయి. మతసామరస్యం ఉన్న హైదరాబాద్ వంటి నగరంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బండి కామెంట్స్ ఆజ్యం పోస్తాయంటూ కూడా చెప్పుకోచ్చారు. కానీ.. బండి సంజయ్ చాలా వ్యూహాత్మకంగా ఎంఐంఎ శ్రేణులను రెచ్చగొట్టేందుకే కామెంట్స్ చేశారనే వారూ లేకపోలేదు. దీనివల్ల ఎంఐఎం నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ మరో మెట్టు కిందకు దిగి హిందువుల గురించి వ్యతిరేక కామంట్స్ చేస్తారు. దీన్ని ఖండించలేక టీఆర్ ఎస్ కూడా ఇబ్బంది పడుతుంది. ఇటువంటి వాతావరణాన్ని తాము వాడుకోవాలనేది బీజేపీ వ్యూహం కావచ్చు. ఈ ఉచ్చు ఇప్పటికే ఎంఐఎం చిక్కుకుంది. దీని ప్రభావం తప్పకుండా పోలింగ్ సరళిమీద ప్రభావం చూపతుందనేది కూడా తెలుస్తోంది. రెచ్చగొట్టే మాటలు.. ప్రసంగాలతో నగర వాతావరణం కలుషితం అవుతుందనే భయం కూడా సామాన్యుల్లో నెలకొంది. ఒకవేళ బీజేపీ గెలిచిన మేయర్ పీఠం ఎక్కితే.. ఎంఐఎం ప్రతిగా ఎటువంటి ప్రతిదాడులకు దిగుతుందనే భయాందోళనలూ సామాన్యుల్లో నెలకొంది.