ఏం పర్లేదు.. మా ఆయిల్ చల్లుకుంటే కరోనా రాదు. అబ్బే కొవిడ్ మిమ్మల్నేం చేయదు.. ఇదిగో ఈ నిమ్మకాయ మీ వద్ద ఉంచుకోండి. ఇదంతా ఎందుకురా భయ్… మా వద్ద స్వర్గానికి స్కీమ్ ఉంది.. లక్ష రూపాయలే. ముందుగానే బుక్ చేసుకుంటే పది శాతం డిస్కౌంట్.. మీకు పిల్లలు పుట్టట్లేదా… ఇవన్నీ మీ కోసమే తాయెత్తులు కడితే పిల్లలు. నిమ్మకాయ వాసన చూస్తే కరోనా పోతుందా! అంటే.. వీళ్లంతా పక్కాగా పోతుందనే చెబుతారు. అమాయకత్వమే వీళ్లకు నజరానా. ప్రజల భయాలు ఇటువంటి బ్లాక్ మేజిక్‌లు, బురిడీ బాబాలకు నోట్లు కురిపించే వరాలు. అందాకా ఎందుకు పిడుగురాళ్ల నుంచి హైదరాబాద్ దిగుమతి అయిన ఓ శర్మ.. రంగురాళ్లతో మాంచి గిరాకీ పెంచుకున్నాడు. ప్యాకేజీలతో ఆఫర్ ఇచ్చే టీవీఛానళ్లతో దోస్తీ కట్టాడు. నీకింత.. నాకింత అంటూ రోజూ ప్రసంగాలు.. రాయి మీ వేలికి ఉంటే.. కోటీశ్వరుడు కావచ్చంటూ పంగనామాలు. ఇటువంటి సామోరికి.. కూడా ఝలక్ ఇచ్చారు ముగ్గురు శిష్యులు. ఇంకేముంది.. మా బాబా వద్ద ఎంత డబ్బు ఉందనేది చూసి.. కోట్లకు కోట్ల సంపద ఉందని తెలిసి.. అర్దరాత్రి ఆ ముగ్గురూ శర్మగారి ఇంటికి కన్నమేసి కొట్టేశారు. దీంతో సాములోరు.. పోలీసుల వద్దకెళ్లి రంగురాళ్లు.. రూ.40 లక్షల విలువైనవి చోరీకు గురయ్యాయంటూ ఫిర్యాదు చేశారు.
పోలీసులు రంగంలోకి దిగి బుర్రంతా ఉపయోగించి దొంగల్ని పట్టేశారు. అసలు నిందితులెవరు నిగ్గుతేల్చారు. ఆ గురువు పేరు బెల్లంకొండ మురళీకృష్ణ శర్మ. ఆయన శిష్యులు నాగేంద్రశర్మ, పవన్ కుమార్ శర్మ, దొండపాటి రామకృష్ణ, నల్లబోతుల సురేష్‌గోపి, చండలూరి విజయ్‌కుమార్.. అయితే పోలీసులకు దొరికిన రూ.17.72 కోట్లు అసలవి కాదు.. నకిలీనోట్లని గుర్తించటమే ఇక్కడ ఊహించని షాక్. దీంతో అందర్నీ కలసి అరెస్ట్ చేశారు. పాపం.. శర్మగారు రాళ్లు పోయాయని ఫిర్యాదు చేస్తే ఇప్పుడు జైల్లో రాళ్లు కొట్టాల్సి వస్తుందని ఊహించి ఉండరేమో