కరోనా.. కరోనా స్ట్రెయిన్.. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వరుసగా వైరస్‌లు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. మానవాళికి హెచ్చరికలు పంపాయి. 2006లో తొలిసారిగా బర్డ్‌ఫ్లూ భారత్‌లో కనిపించింది. బర్డ్‌ఫ్లూ ప్రమాదకరమనే చెబుతున్నారు వైద్యనిపుణులు. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్తాన్, హర్యానా తదితర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అక్కడ పెంపుడు పక్షులను చంపేయమంటూ ఆదేశాలు జారీచేశాయి. పొరుగునే ఉన్న తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పక్షుల నుంచి మనుషులకు వ్యాపించే బర్డ్‌ఫ్లూతో ప్రమాదమనే వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనా స్ట్రెయిన్ భయం వెంటాడుతోన్న సమయంలో బర్డ్‌ఫ్లూ వదంతులు తెలుగు ప్రజలను మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కరోనా నుంచి బయటపడేందుకు ప్రోటీన్ ఫుడ్ తీసుకునే ప్రజలకు చికెన్ ప్రత్యామ్నాయంగా దొరికింది. పది నెలలుగా ప్రజలు చికెన్ తింటున్నారు. ఐదారు నెలల పాటు చికెన్ తింటే కరోనా వస్తుందనే అపోహతో మాంసానికి దూరంగా ఉన్నారు. ఇది పౌల్ట్రీపరిశ్రమను దారుణంగా దెబ్బతీసింది. కోళ్లను పెంచలేక ఉచితంగా పంపిణీ చేశారు. కొందరైతే చంపేసి వాటిని తగులబెట్టారు, నేలలో పూడ్చారు. ఇప్పుడు మరోసారి బర్డ్‌ఫ్లూ హెచ్చరికలతో ఫౌల్ట్రీ పరిశ్రమ దారుణంగా దెబ్బతింటుందనే ఆందోళన నెలకొంది. రెండ్రోజులుగా అమ్మకాలు కూడా దారుణంగా పడిపోతూ వస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో రూ.180 ధర ఉండగా.. తాజాగా అది రూ.150కు చేరింది. మున్ముందు ఎంతగా ఉంటుందనే పరిశ్రమ వర్గాల్లో భయం పుట్టిస్తున్నాయి. పక్షులతో వ్యాపించే బర్డ్‌ఫ్లూ ప్రమాదకరమని యూరఫ్ శాస్త్రవేత్తలు తొలిసారి గుర్తించారు. దీన్నుంచి బయటపడేందుకు ఇప్పుడు కరోనా సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సుమారు 2000కు పైగా వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. పక్షుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెంపుడు జంతువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ప్రస్తుతం బర్డ్‌ఫ్లూ వ్యాపించినట్టు దాఖలాల్లేవు. కాబట్టి.. పెంపుడు జంతువుల యజమానులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు.