ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బాబాయి వివేకానందరెడ్డి కేసు దర్యాప్తు సీబీఐ వేగవంతం చేసింది. 13వ రోజు పలువురు అనుమానితులను కడప జైలులోని గెస్ట్ రూమ్‌లో ప్రశ్నిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మున్నా అనే చెప్పుల దుకాణ యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించటంతో కీలకమైన సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఒక మహిళ, మరో హిజ్రా కూడా అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తున్న నేపథ్యంలోనే కొత్త అంశాలు వెలుగు చూసినట్టు సమాచారం. మున్నా ఆనే వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ.40లక్షలకు పైగా నగదు, 28 లక్షల రూపాయల ఫిక్సడ్ డిపాజిట్, 50 తులాల బంగారం ఉండటం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇతడితోపాటు అదుపులో ఉన్న మరో మహిళ కూడా కేసులో కీలక ఆధారాలు అందించినట్టుగా వార్తలు వస్తున్నాయి. వీటిని ఇంకా సీబీఐ ధ్రువీకరించనప్పటికీ.. అన్ని రాజకీయ పక్షాల్లోనూ టెన్షన్ నెలకొంది. వివేకానందరెడ్డి మర్డర్ చేసేంత అవసరం ఎవరికి వచ్చిందనేది కూడా చర్చనీయాంశంగానే ఉంది. అన్న వైఎస్ సీఎం అయినా కూడా వివేకానందరెడ్డి మాత్రం.. అందరితో.. అన్నిపార్టీలతోనూ సన్నిహిత సంబంధాలు నెరిపేవారు. అజాతశత్రువుగా ఆయనకు పేరుంది. అటువంటి వ్యక్తి హత్య రాజకీయంగా కూడా పెను సంచలనం రేకెత్తించింది.
2019 మార్చి 15న పులివెందులలో ఘోరం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురయ్యాడు. అప్పటికే ఏపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఎన్నికల వేళ జరిగిన వైఎస్ వివేకా మర్డర్‌కు టీడీపీ కారణమంటూ వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. ఇదంతా సానుభూతి కోసం వైసీపీ అధినేత ఆడిన డ్రామాగా టీడీపీ ఎదురుదాడి చేసింది. ఎన్నికల్లో వైసీపీ గెలవటంతో ఈ కేసు దర్యాప్తు వేగవంతం అవుతుందని అందరూ భావించారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి కూడా సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించారు. మధ్యలో ఏమైందో.. దర్యాప్తు అధికారులను బదిలీ చేశారు. స్వయంగా రాష్ట్ర డీజీపీ గౌతమ్‌నవాంగ్ దర్యాప్తు గురించి ఆరా తీశారు. అయినా ఆశించినంతగా కేసు పురోగతి సాధించలేకపోయింది.
దీనిపై గతేడాది వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ ఎన్.సునీతారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరారు. దీంతో హైకోర్టు ఆదేశాలతో వైసీపీ సర్కార్ సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీచేసింది. అప్పటి వరకూ చంద్రబాబు తన ఇలాఖాలాలోకి సీబీఐ, ఈడీ, వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రాకూడదంటూ తెచ్చిన జీవోను జగన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. కేసులో కీలక పరిణామాలు.. కొందరు అనుమానితుల మరణాలు వివేకా మరణంపై అనుమానాలను మరింత పెంచాయి. ప్రస్తుతం సీబీఐ కూడా దర్యాప్తును వేగవంతం చేసింది. తనదైన శైలిలో దర్యాప్తు దూకుడు పెంచారు. వైఎస్ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ప్రశ్నించారు. ఇటువంటి సమయంలో మున్నా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవటం.. మరో మహిళ నుంచి కూడా కీలక వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. చెప్పుల దుకాణ యజమాని మున్నా కు ముగ్గురు భార్యలు. వారి మధ్య గొడవపై వివేకా సర్దుబాటు చేయటమో.. హెచ్చరించటమో చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఒక మహిళ కీలకమైన వివరాలు అందజేసినట్టుగా తెలుస్తోంది. మరో వైపు ఎంపీ అవినాస్‌రెడ్డి అనుచరుడు ఉదయ్‌కుమార్‌రెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇప్పటికే పలువురి ఫోన్లు, వారి సంభాషణలు, ఛాటింగ్స్, బ్యాంకు లావాదేవీలను కూడా సీబీఐ సేకరించింది. మరికొద్ది రోజుల్లో అసలు హంతకులు ఎవరనేది సీబీఐ కోర్టుకు వివరాలు అప్పగించనుందని సమాచారం.