రాయపాటి సాంబశివరావు..చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోందా! ఈ దఫా సీబీఐ నుంచి తప్పించుకునే అవకాశం లేదనే పుకార్లు నిజమేనా! ట్రాన్స్ ట్రాయ్ కంపెనీలో పెట్టుబడుల వ్యవహారంపై సీబీఐ తాజాగా గుంటూరులోని మాజీ ఎంపీ ఇంటిపై దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఈ దఫా రాయపాటి చుట్టూ గట్టిగానే కేసులు బిగుసుకుంటున్నాయనే వాదన బలపడుతోంది.
పొగాకు వ్యాపారి నుంచి ఎంపీ వరకూ ఎదిగిన నేత. సామాజికంగా.. ఆర్ధికంగా.. రాజకీయంగా తనకంటూ ప్రత్యేకత ఉన్న నాయకుడు. కమ్మ సామాజికవర్గంలోనూ ఆయనదో కోటరీ. గుంటూరు జిల్లా రాజకీయాల్లో అంతటి గుర్తింపు తెచ్చుకున్నా ఎందుకో లక్ కుదరట్లేదు. కేంద్ర మంత్రి పదవి… టీటీడీ ఛైర్మన్ పదవిపై పలుమార్లు ఆశలు పెట్టుకుని విపరీతంగా పైరవీలు చేసినా వర్కవుట్ కాలేదు. 2014కు ముందు గుంటూరు జిల్లాలోని కాంగ్రెస్‌తో రాయపాటిది ఒక హవా. ఏ సీఎం వచ్చినా రాయపాటి వారి ఆతిథ్యం అందుకోవాల్సిందే. కాంట్రాక్టులు, పైరవీలలో ఆయనకు ఆయనే సాటి అనేంతగా చక్రం తిప్పారు. తమ్ముడు శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీ, కొడుకును మేయర్ను చేయగలిగారు.
గత ఎన్నికల్లో ఓటమి చవిచూశాక రాజకీయంగా కాస్త దూరం జరిగినట్టుగా తెలుస్తోంది. ఏ పార్టీలో ఉన్నా అక్కడ జరిగే అంశాలపై కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం ఆయన నైజం. అదే ఆయనను రాజకీయంగా కాస్త ఒడిదొడుకులకు గురిచేసిందంటారు అభిమానులు. ఇటీవల ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారనే వాదన వచ్చింది. కానీ.. ఆయన శిష్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ వైసీపీలోకి చేరి ఎమ్మెల్సీ ఛాన్స్ కొట్టేశారు. రాయపాటి మొదటి నుంచి వివాదాల్లోనే ఉంటున్నారు. పొగాకు వ్యాపారం చేసే సమయంలోనూ విదేశాలకు ఎగుమతి చేసే పొగాకులో రాళ్లు జొప్పించారనే ఆరోపణలున్నాయి. దానివల్లనే కొన్నేళ్లపాటు ఏపీ పొగాకును కొన్ని దేశాలు నిషేధం విధించినట్టుగా గుసగుసలూ లేకపోలేదు. ఆ తరువాత బ్యాంకు రుణాల ఎగవేత, కాంట్రాక్టుల విషయంలో అవకతవకలు ఇవన్నీ ఉన్నా.. ఎంపీగా తనకున్న పలుకుబడి.. రాజకీయ అండదండలతో బయటపడుతున్నారు. ప్రస్తుతం టీడీపీ, కాంగ్రెస్ రెండు ప్రతిపక్షంలో ఉన్నాయి. రాజకీయంగా ఎటు నుంచి సాయం అందే అవకాశాలు మూసుకుపోయాయి. ఇవన్నీ రాయపాటిని చిక్కుల్లోకి లాగుతాయనే ఆందోళన కూడా టీడీపీ కార్యకర్తల నుంచి వినిపిస్తోంది.



