కరోనా.. ఆరు నెలల క్రితం పేరు వింటే బెంబేలెత్తాం. బాబోయ్ అంటూ ముఖానికి మాస్క్‌లు.. చేతులకు శానిటైజర్లు పూసుకున్నాం. మరి ఇంతలో ఏమైంది.. ఎందుకింత నిర్లక్ష్యం. ఇండియాలో తాజాగా 90వేలకు పైగా కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. దేశంలో 42,04,613 కేసులు ఇప్పటి వరకూ ఉన్నాయి. 33 లక్షల మంది కోలుకున్నారు. 72 వేల మంది వరకూ మరణించారు. సగటున రోజుకు 90,000 కేసులు వస్తే.. మున్ముందు వీటి తీవ్రత ఎంత ఉంటుందో తెలుసా! అక్షరాలా మూడు లక్షలు(3,00,000) వినేందుకు భయంగా ఉంది కదూ! మరో ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. ఒకసారి వైరస్ సోకిన వారికి మరోసారి కూడా వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో సుమారు 4 కేసులున్నాయి. ఏపీలో ఇప్పటికి నమోదుగాకపోవటం ఊపిరిపీల్చుకునే అంశం. అయితే.. వైరస్ వ్యాప్తి.. తిరిగి సోకటం వంటివాటిపై పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తల మధ్య కూడా భిన్నాభిప్రాయాలున్నాయి.
ఏ ఒక్కటీ నిజం కాదనలేం.. ఔనని అంగీకరించలేమంటున్నారు వైద్యనిపుణులు. దీన్ని బట్టి ఏతావాతా తేలిందేమిటంటే.. కరోనా మీ వాకిట్లోనే.. ఉందనేది గుర్తించాలి. మీరు నమ్మకం లేకపోయినా ఇది వాస్తవం . అదెలా అంటారా… కొవిడ్19 పాజిటివ్ కేసుల్లో 60శాతం మందిలో లక్షణాలు ఉండట్లేదు. వచ్చి తగ్గిన సంగతే తెలియట్లేదు. వీరివల్లనే అసలు ప్రమాదం. ఎందుకంటే.. రోగనిరోధకశక్తి ఉండటం వల్ల వీరిలో లక్షణాలు బయటకు కనిపించవు. దీంతో అందరితో కలుపుగోలుగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసే నివసిస్తుంటారు. అయితే.. స్నేహితులు, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటే.. కేవలం మూడు రోజుల్లోనే వైరస్ వారిలోకి ప్రవేశిస్తుంది. అంటే.. తాము జాగ్రత్తగా ఉన్నమనే భ్రమలో సొంతవారి ద్వారానే వైరస్‌కు గురవుతున్నారు. 20-40 సంవత్సరాల లోపు వారు వైరస్‌కు గురవుతున్న కేసులు 30-45 శాతం పెరిగింది. పొగతాగటం, మద్యం, శ్వాసకోశ సమస్యలు, బీపీ, షుగర్ ఉన్న వారు మొదట్లో లైట్‌గా తీసుకుంటున్నారు. ఒకవేళ డాక్టర్ దగ్గరకు వెళ్లినా.. తమకు ఫలానా అనారోగ్య సమస్య ఉందని చెప్పట్లేదు. దీంతో వైద్యం అందించేలోపుగానే సీరియస్ అవుతున్నాయి.
ఇటీవల విజయవాడలో 50 ఏళ్ల వ్యక్తికి జ్వరమొచ్చింది. అన్నిరకాల పరీక్షలు చేసినా ఎక్కడా కరోనా అని తేలలేదు. చివరకు.. సిటీస్కాన్‌లో మాత్రం 4-5 పాయింట్లు ఉన్నట్టు బయటపడింది. అతడికి సోకేందుకు ప్రధాన కారణం.. కరోనా శరీరంలో ఉండి.. లక్షణాలు లేని వ్యక్తితో దగ్గరగా మెలగటమేనంటూ వైద్యులు తేల్చారు. వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుందో తెలియదు. వైరస్ శరీరంలో కేవలం 14 రోజులేఉంటుందని ధీమాగా ఉండే అవకాశం లేదు. కాబట్టి.. ప్రముఖ పల్మనాలజిస్టులు, కార్డియాలజిస్టులు చెబుతున్న సలహా ఒక్కటే.. దయచేసి నలుగురు వున్న చోటికి వెళ్లొద్దు. ముఖానికి మాస్క్‌లేకుండా బయటకు రావద్దు. చేతులు సబ్బుతో, శానిటైజర్‌తో శుభ్రపరచుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేయవద్దని. ఏమంటారు.. వచ్చేది చలికాలం.. వైరస్ మరింత విజృంభించే వీలుందనే ఆందోళన కూడా ఉంది. కాబట్టి.. ఆరోగ్యం కాపాడుకోవటమే కాదుసుమా! నిర్లక్ష్యంగా ఉంటే భారీమూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నమాట.