యుద్ధం కంటికి కనిపించని ప్రత్యర్థితో వార్ ఫీల్డ్‌లో ఉన్నాం . ఇక్కడ బంధాలు బంధుత్వాలు అన్నీ కనిపించకుండా పోతున్నాయి నిజమే. ఆత్మీయంగా మెలిగే స్నేహితులు దూరమవుతున్నారు కష్టంలో తోడుండే వారు కూడా దరిచేరలేకపోతున్నారు. ఫోన్ చేసినా అవతలి వారి కష్టాలు… ఇవతలి వారి బాధలు తప్ప ఏమీ లేవు. ఇటువంటి కఠినమైన సమయంలో ఎమోషన్స్ అదుపు తప్పుతున్నాయి. కోపం.. పగ ప్రతీకారం.. అన్నింటినీ మించిన అసహనం పెల్లుబుకుతుంది. పిలవకుండా వచ్చే కోపతాపాలు ఆలు మగల మధ్య గొడవలు .. మనస్పర్దలు తెచ్చిపెడుతున్నాయి. అందాకా ఎందుకు.. మొన్నీ మధ్య ఓ రోజు ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్, నర్సు జట్టుపట్టుకుని కొట్టుకునేంత వరకూ వెళ్లారట. వారం రోజుల పాటు ఇంటిముఖం చూడకపోవటం వల్ల తలెత్తిన ఒత్తిడి వారి మధ్య పదేళ్లుగా ఉన్న స్నేహాన్ని ఇలా చెరిపేసింది. ఇలా.. ఒకటా . రెండా.. ప్రపంచదేశాలు కూడా తమ వైరాన్ని మరచి చేయి చాచుకుంటున్నాయి. ఇండియా అంటే భగ్గుమనే పాకిస్తాన్ కూడా భారతీయులకు ప్రాణవాయువు సరఫరా చేస్తామంటోంది. ఓ ఉద్యోగి తన ఖరీదైన కారు అమ్మేసి ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేసి పంపిణీ చేశాడు.. ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి తన సంపాదనంతా కరోనా రోగుల కోసం ఖర్చుచేశాడు. ఇలా ఎవరికి వారే బయటి వ్యక్తులు సాయం అందించేందుకు ముందుకొస్తుంటే మనిషిగా.. మనసున్న మనం మరెంత చేయాలి. మనవారి కోసం ఇంకెంతగా చేయూతనివ్వాలనేది అందరూ ఆలోచించాల్సిందే.. సో.. ఎమోషన్.. రిలేషన్స్‌ను ఏ వైరస్ ఏం చేయలేదనేది చూపాల్సిన బాధ్యత అందరి భుజాలపై ఉందంటున్నారు సామాజిక వేత్తలు.