ఇది నామాట కాదండోయ్ పెద్ద పెద్ద వైద్యవిద్య చదివిన వైద్యనిపుణుల సూచన . రెండో దశలో కరోనా విరుచుకుడు పడుతుంది డేంజర్ బెల్స్ మోగిస్తుందనేది అందరికీ తెలుస్తూనే ఉంది. అందుకే ఎవరి జాగ్రత్తలు వారే తీసుకోవాలి. ముఖానికి మాస్క్ వీలైతే రెండు కలిపి కడితే మస్త్ మంచిది. రెండోది దూరంగా ఉందాం.. మనోడే కదా! రాసుకుపూసుకుని తిరిగితే గూబ గుయ్‌మనేంత ఆసుపత్రి బిల్లు చేతికిస్తారు. హైదరాబాద్‌లో వారం రోజులు ఆసుపత్రిలో ఉన్న ఓ కుర్రాడికి 11 లక్షలరూపాయల బిల్లు వేశారు. మూడోది.. చేతులు శుభ్రం చేసుకోవాలే. ఇవన్నీ చేస్తూనే ఉన్నంతలో మంచి ఆహారం తీసుకోవాలి. చాలామందిలో వైరస్ ఉన్నా లక్షణాలు తెలియట్లేదు. కానీ.. ఆ ఇంట్లో పెద్దలు, రోగాలతో బాధపడేటోళ్లు ఉంటే మాత్రం వారికి వెంటనే సోకుతుంది. ఆఖర్లో పరేషాన్ చేస్తుంది. అసలు సమస్య ఆక్సిజన్. ఉదయం 98 వరకూ ఉండే రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ షడన్‌గా 90కు పడిపోతున్నాయి. ఇదే ప్రమాదం.. అందుకే పల్స్ ఆక్సిమీటర్ మార్కెట్‌లో 700-800 రూపాయలకు దొరుకుతుంది. దాని ద్వారా మన గుండె స్పందన, ఆక్సిజన్ పరీక్షించు కోవచ్చన్నమాట. కుడిచేతి చూపుడు వేలును ఆక్సిమీటర్‌లో ఉంచగానే అంకెలు వస్తాయి. ఒకటి ఆక్సిజన్, మరొకటి పల్స్ రేటు చూపుతుంటాయి. పల్స్ రేటు 60 కంటే ఎక్కువగా ఉండాలి.. 100 దాటినట్టు అనిపిస్తే జాగ్రత్తపడాలి. మరొకటి ఆక్సిజన్ ఆరోగ్యంగా ఉన్నవారిలో 95 పై న ఉంటుంది. కొవిడ్‌తో ఇంట్లో చికిత్స పొందుతున్న వారిలో 94 వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. డాక్టర్లను సంప్రదించి వెంటనే మందులు వాడటం మొదలుపెట్టాలి. 90 తగ్గితే వెంటనే ఆసుపత్రిలో చేరాలి. ఈ ఒక్క పనిచేయకపోవటం వల్లనే చాలామంది చివర్లో ఆక్సిజన్ పడిపోయినట్టు గ్రహించి ఆసుపత్రికి పోతున్నారు. డాక్టర్టు కూడా ఏమి చేయలేక చేతులు ఎత్తేస్తున్నారు. రక్తపోటు, షుగర్‌తో బాధపడేవారిలో ఎటువంటి సమస్య ఉన్నట్టుగా పైకి కనిపించదు. కానీ అకస్మాత్తుగా ఆక్సిజన్ తగ్గటం, ఆయాసపడటం వంటి వాటితో ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఒక్క ఆక్సిమీటర్ ఇంటిల్లిపాదినీ ముందస్తుగా హెచ్చరిస్తూ కాపాడుతుందనేది డాక్టర్ల సూచన.