నిన్నటిలా ఉండలేకపోతున్నాం.. ఏదో తెలియని భయం వెంటాడుతున్న అనుభూతి. అంతా బాగానే ఉన్నట్టుగా ఉంటుంది. ఇంతలోనే తెలియని గుబులు కమ్మేస్తుంది. నిజమే.. ఇదంతా కరోనా రేకెత్తించన మానసిక కల్లోలం. సాధారణ సమయంలోనే ప్రతి 40 సెకన్లకు ఒకరు ప్రపంచంలో ఏదోఒక మూలన ఆత్మహత్య చేసుకుంటుంటారు. ఏటా 8,00,000 మంది బలవన్మరణాలు చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు కారణాలైన 15 అంశాల్లో ఆత్మహత్యలది 1.4శాతం . ఇదీ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న గణాంకాలు.
ఇండియాలో 2019లో 1,39,123 మంది ప్రాణాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 6,465 మంది, తెలంగాణలో 7675 మంది సూసైడ్ చేసుకున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2019 నివేదికలో తెలిపింది. 2020 లో చైనాలో మొదలైన కొవిడ్19 వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. భవిష్యత్‌పై ఆలోచనలను చిదిమేసింది. ప్రతికూల పరిస్థితుల్లో వైరస్ వ్యాపిస్తుందనే భయం.. ఒకవేళ వైరస్ వచ్చి తగ్గినా సమాజం తనను ఎలా చూస్తుందనే ఆందోళన.. రేపటి గురించిన చింత ఇవన్నీ ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. వీటిని కట్టడి చేయాలనే ఉద్దేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం(వరల్డ్ సూసైడె ప్రివెన్సన్ డే)గా అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటారు. గురువారం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా స్పెషల్ స్టోరీ.
మరి ఈ పరిస్థితి నుంచి బయటపడెదెలా! భవిష్యత్‌పై పాజిటివ్‌గా ఆలోచించటం ఎలా అంటూ మనసును వేధించే ఎన్నో ప్రశ్నలకు అపోలో ఆసుపత్రి ప్రముఖ మనస్తత్వనిపుణులు డాక్టర్ కె.సురేష్ రెడ్డి పలు సూచనలు చేస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా అధిగమించాలనేది వివరించారు.
రంజన్ (పేరు మార్చాం) ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. కోవిడ్ కారణంతో ఉద్యోగం కోల్పోయాడు. తద్వారా ఏర్పడిన తీవ్ర ఆర్థిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్యే మొత్తం సమస్యకు పరిష్కారమని భావించి ఆత్మహత్యకు పాల్పడినాడు.
ఓ గృహిణి.. జ్వరం వచ్చిందని వణకిపోయింది. ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయిస్తే.. టైఫాయిడ్ గా తేలింది. అయినా తనలోని భయం మాత్రం వీడలేదు.. తెల్లవారుజామున మూడంతస్తుల భవనం పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. తన వల్ల కుటుంబంలో అందరికీ వైరస్ సోకుతుందనే భయమే దీనికి కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇలా.. ఎన్నో ఘటనలు. మనషులను దూరం చేసింది. బంధుత్వాన్ని తెంపేసింది. పచ్చిగా చెప్పాలంటే మానవత్వాన్ని ప్రశ్నార్ధకంగా చేసింది. కరోనా వైరస్ చాలా మందిని ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని మనకు ఇలాంటి ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. కానీ కోవిడ్ ను ఎదుర్కోవడానికి ఆత్మహత్యలే సమాధానమా అంటే కాదనే నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ విసిరిన సవాళ్లెన్నో, ఈ మహమ్మారి బారిన పడిన ప్రజలు ఆరోగ్య, వృత్తిపరమైన, ఆర్థిక పరమైన ఒత్తిడిలకు లోనవుతున్నారు. ఇలా ఏర్పడిన మానసిక, శారీరక ఒత్తిడుల కారణంగా అటు కోవిడ్ వచ్చిన వారిలో, రాని వారిలోనూ డిప్రేషన్, యాంగ్జైటీ లేదా ఆందోళన వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటితో పాటూ ప్రజలు ఇంటికే పరిమితం కావడం, కోవిడ్ వస్తే చికిత్స బ్రతుకు ఎలా అన్న ఆందోళన, ఉద్యోగాలపై అనిశ్చితి లేదా కోల్పోవడం వంటి కారణఆలు ప్రజలపై మానసిక ఒత్తిడి పెరిగేలా చేస్తున్నాయి.
ఇక గతాన్ని పరిశీలిస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం దక్షిణాసియా అదీ భారత దేశంలో ప్రతి లక్ష మందికి 16.5 మంది ఆత్మహత్యలు జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అలానే 15-29 వయస్సులో ఉన్న వారు ఆత్మహత్యలకు పాల్పడి సందర్భాలలో 38 శాతం కేసులలో ఇతర కుటుంభ సభ్యులు కూడా ఆత్మహత్యలకు పాల్పడినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే ఒక వ్యక్తి ఆత్మహత్య కుటుంభంలో సంక్షోభానికి కారణమవుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఈ గణాంకాలు ఎలా ఉన్నా ఆత్మహత్యలపై ప్రజలలో అవగాహన లేమి మాత్రం తీవ్రంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంతో ఎంతో మంది తమ ప్రక్క వారిలోనే ఆత్మహత్యను ప్రేరేపిస్తున్న లక్షణాలు తీవ్రంగా ఉన్నా వాటిపై అవగాహన లేక వాటిని నిరోధించలేక పోతున్నారనే విషయాన్ని నిపుణులు అంగీకరిస్తున్నారు. అందుకే ఈ అంశాలపై విస్తృత అగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారంటున్నారు.
కనిపెడితే పసిగట్టవచ్చు
ఆత్మహత్య అనేది మన సమాజంలో ఎన్నో ఆపోహలు, భయాలతో కూడిన అంశంగా భావించబడుతోంది. దీంతో దీనిపై మాట్లడడానికి అందరూ పెద్ద ఇష్టపడరు. దీంతో ఒక వేళ ఒక వ్యక్తి ఆయా లక్షణాలతో భాదపడుతున్న విషయాన్ని గుర్తించడం జరుగడం లేదు. ఈ విషయంలో మార్పు జరగాలని, ఆత్మహత్య అనేది ఒక మానసిక సమస్య అని ప్రజలందరూ గుర్తించగలిగితే వాటిని అరికట్టడం సులభం.
ఆత్మహత్య చేసుకోవాలని అనుకొనే వాటిలో చాలా వరకూ నిరాశలో ఉండడం, త్వరగా అలసిపోవడం, దేని మీద శ్రద్ద లేదా ఆసక్తి లేకపోవడం, ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడడం, చిరాకు లేదా కోపం ఎక్కువగా ఉండడం, నిద్ర మరియు ఆకలి తగ్గిపోవడం తో పాటూ చావు, చనిపోవడం, ఆత్మహత్య గురించి తరచుగా మాట్లాడుతూ వాటిపై ఆసక్తి కనపరచడం వంటి లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి. వీటితో పాటూ తీవ్రంగా కృంగిపోవడం (డిప్రషన్) కూడా గమనించవచ్చు. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఎవరిలో కనిపిస్తాయో వారు ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్న వారిగా గుర్తించి వెంటనే తగిన పరిష్కారం దిశగా అడుగులు వేయాల్ ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
సమయానికి సాయం అందించాలి
ఆత్మహత్యలకు పాల్పడడానికి ఆలోచిస్తున్న వ్యక్తికి కుటుంభం మరియు సమాజ మద్దతు చాలా అవసరం. అలానే సమయానుగుణంగా మానసిక నిపుణుల సహాయం తీసుకోవడం కూడా తప్పనిసరి. సమాజంలో తప్పుగా భావించే ఈ సమస్యను దాచిపెట్టకుండా దగ్గరి వ్యక్తులు దానిపై చర్చించి అటువంటి మానసిక స్థితిలో ఉన్న వ్యక్తికి సహాయపడాలి. ముఖ్యంగా ఈ సమస్య గుర్తించి పరిష్కరించాలనుకొనే వ్యక్తులు అంటే కుటుంభ సభ్యులు కాని, స్నేహితులు కాని అందుకోసం సమయం వెచ్చించడం తో పాటూ, ఓపిక మరియు సహనంతో అతనికి సహాయడాలి అనే మనస్థత్వం తో ముందుకు సాగాలి.
దీంతో అవతలి వారు మానసిక కృంగు బాటులో ఉన్న వ్యక్తి చెబుతున్న దానిని చాలా ఓపికగా విని, వారి సమస్యను అర్థం చేసుకొంటూ, తగిన సమయం వారితో గడుపుతూ, వారిలో ధైర్యాన్ని నింపుతూ నీవు ఒంటిరి వాడివి కావు, నీతో మేమందరూ ఉన్నాం అనే భావన కలిపిస్తూ ఆత్మ స్థైర్యాన్ని నింపడం చేయాలి. అదే సమయంలో కేవలం మాటలతో సరిపుచ్చకుండా చేతలలో కూడా పరిష్కారాన్ని చూపిస్తూ తద్వారా ధైర్యాన్ని కలుగజేయడం కూడా అంతే ఆవశ్యకరం.
ఇదే పంథాలో ప్రస్థుతం కోవిడ్ మహమ్మారి విసిరిన సవాళ్ల తో ఇబ్బంది పడుతున్న వారిలో ఏర్పడుతున్న మానసిక అసంతుల్యత, మానసిక ఒత్తిడి ని వెంటనే గుర్తించి దాని ప్రభావం ఎక్కువగా ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ ధైర్యాన్ని నింపాలి. అలానే కోవిడ్ వచ్చిన వారిపై వివక్ష చూపకుండా అవసరమైతే వారికున్న ఇతరత్రా సమస్యలను దూరం చేయడంలో కుటుంభ సభ్యులు, స్నేహితులు పాలుపంచుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు ఇందులో ఎంతో ప్రధానం. అందుకు కుటుంభం లో అన్ని వ్యక్తులు కలసి పని చేస్తే ఈ ఇబ్బందులను నెమ్మదిగా దూరం చేసుకోవచ్చనే విషయాన్ని అర్థం చేసుకొని మనో స్థైర్యాన్ని నింపడం వలన ఆత్మహత్యలను నివారించవచ్చు.
ఇక ఇలాంటి ఇబ్బందులతో పాల్పడుతున్న వారు ఆత్మహత్యల నివారణకు ఏర్పాటైన ఎన్నో హెల్ప్ లైన్ లను సంప్రదిస్తే వారు మీకు సరైన పరిష్కార మార్గం చూపడమే కాకుండా మార్గదర్శనం కూడా చేస్తారు. వీటిపై కూడా ప్రజలు విస్తృత స్థాయిలో అవగాహన కలిపించాలి..