బల్లకింద చేతులు.. అమ్యాలు.. ఇప్పుడైతే ఫార్మాలిటీ.. పేరు మారినా దానిపేరు మాత్రం లంచమే. ఒకప్పుడు పెళ్లిచూపులకు వెళితే.. అబ్బాయి ఫలానా ఆఫీసులో ఉద్యోగం. జీతం వెయ్యి.. పై పదివేలు అంటూ చెప్పేవారు. ఒకవేళ పెళ్లికొడుకు తాలూకూ వాళ్లు చెప్పటానికి మొహమాట పడినా.. ఇంతకీ అబ్బాయికి పై ఆదాయం ఎంత అంటూ ముఖానే అడిగేసేవారు. లంచపు సొమ్ముకు 1980లోనే అంత క్రేజ్ ఉండేది. మరి ఇది 2020 ట్వీ20 మ్యాచ్ మాదిరిగా ఫటాఫట్. నాకింత.. నీకింత.. అని తేల్చాయాల్సిందే. అసలు ఈ సోదంతా ఎందుకు దండగ అసలు విషయంలోకి వద్దామ.. మొన్నా మధ్య షేక్‌పేటలో సర్కారు భూమి కొట్టేసేందుకు పథకం పన్నిన ఓ దళారి రూ.50లక్షలు లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. తూచ్.. ఇంకా కావాలనటంతో అతడు కాస్తా.. ఏసీబీ వద్దకు చేరాడు. చివరకు సదరు తహసీల్దార్‌తో సహా ఆర్ ఐ కూడా జైలు ఊచలు లెక్కబెట్టారు. నిన్న కీసర తహసీల్దార్ ఏకంగా కోటిన్నర లంచం పుచ్చుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వందలకోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు తెలిసిన అవినీతి నిరోధకశాఖ అధికారులు కూడా నోరెళ్లబెట్టినంత పనైంది. ఓ సంస్థ అయితే. మా సారు.. ఇంత రికార్డు స్థాయిలో లంచం తీసుకుంటే గిన్నిస్‌లోకి ఎక్కించరా! అంటూ దీనంగా ప్రార్ధించడం కూడా చూశాం.. ఓస్ మీరంటే.. తహసీల్దార్లు.. మరి నేను అడిషనల్ కలెక్టర్ కనీసం… రెండు కోట్టయినా లేకపోతే ఎలా అనుకున్నాడేమో.. మెదక్‌జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ బండారం కూడా ఇలాగే బయటకు వచ్చింది. ఆడియోలతో సహా అడ్డంగా బుక్కయ్యాడు. చెక్‌ల మీద సంతకాలు..
అడిగినంత తీసుకునేందుకు మరో అడుగు ముందుకేసి ఆస్తులు కూడా రాయించుకున్నాడు. 112 ఎకరాల పట్టాభూమికి ఎన్‌వోసీ ఇచ్చేందుకు రూ.1.12కోట్లు అడిగాడట. మరికొంత అంటే ఐదెకరాల భూమిని తన బినామీ పేరిట రిజిష్ట్రర్ చేయమన్నారడట సదరు అడిషనల్ కలెక్టర్ నగేష్. ఓస్ ఒకసారి రెవెన్యూ ఉద్యోగం సంపాదిస్తే.. కోట్లు సంపాదించటం ఇంత ఈజీనా.. అనవసరంగా.. ఏళ్లకు ఏళ్లు పుస్తకాలన్నీ చదివేసి.. లక్షల మందితో పోటీపడి అనవసరంగా పెద్ద ఉద్యోగాలు తెచ్చుకున్నామంటూ కుర్ర ఉద్యోగులు తెగ ఫీలవుతున్నారట. గతేడాది ఇదే సమయంలో అబ్దుల్లాపూర్ తహసీల్దార్ విజయారెడ్డిని ఆమె కార్యాలయంలోనే ఒక వ్యక్తి పెట్రోల్ పోసి మరీ నిప్పంటించాడు. ఆ తరువాత రెవెన్యూ అధికారులు, సిబ్బంది భయపడినా.. మళ్లీ యధాస్థాయిలో చేతులు చాస్తూనే ఉన్నారు. ఏసీబీ చేతికి చిక్కి జైలు గోడలకు చేరుతూనే ఉన్నారు.



