విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఆదివారం రాత్రి ఏడెనిమిది గంటల మధ్య సందర్శకులతో సందడిగా ఉంది. కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు జనం బాగానే పోగయ్యారు. అటువంటి సమయంలో ఒక వ్యక్తి జేబులో నుంచి పాన్‌కార్డు, ఆధార్, ఫోన్ అన్నీ తీసి ఒడ్డున ఉంచాడు. చూస్తుండగానే కృష్ణమ్మ ఒడిలోకి దూకాడు. అంతే.. అప్పటి వరకూ చూస్తున్న వారంతా కేకలతో ప్రాంతం మార్మోగింది. పక్కనే ఉన్న పోలీసులు సహాయం కోసం తాడు వేసినా.. నీటివేగం ఎక్కువగా ఉంది.. అంతే.. రెప్పపాటులో నుమరుగయ్యాడు. ఆ తరువాత ఒడ్డున దొరికిన ఫోన్ తీసుకుని కాల్‌చేస్తే.. అతడి తండ్రి మాట్లాడారు. తన కొడుకేనంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఇంతకీ.. ఆ వ్యక్తి ఎవరంటే.. డాక్టర్ అద్దెపల్లి శ్రీనివాస్. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వైద్యనిపుణుడు(సైకియాట్రిస్ట్). ఆయన వద్దకు ఎంతోమంది మానసిక వ్యాధులతో వస్తుంటారు. అందరి మనసును ఓదార్చి.. కలతను దూరం చేసి కమ్మటి నిద్ర.. మనసారా సంతోషాన్ని ఆస్వాదించేలా మార్చటమే డాక్టర్ గారికి తెలిసింది. ఇన్నేళ్ల సర్వీసులో ఎందరి మనసుల కష్టాన్ని తెలుసుకుని బాగుచేశారో లెక్కే ఉండదు. కానీ.. ఆయన మనసుకే కష్టం వస్తే.. బయటకు చెప్పుకోలేక మనోవేదనకు గురైతే.. అందులోనూ కరోనా కాలం.. మనిషినే కాదు.. ఎంతో దృఢంగా ఉండే మనసులనూ కూడా కలవరపెడుతోంది. అటువంటి మనసెరిగిన డాక్టర్ తన మసులో కష్టాన్ని.. కన్నీటిలో దాచుకుని.. కృష్ణమ్మతో పంచుకున్నాడు. ఇంతకీ ఆత్మహత్యకు కారణమేమిటంటే.. ఇంట్లో గొడవలు.. భార్యభర్తల మనస్పర్థలేనంటూ డాక్టర్ గారి తండ్రి పోలీసులకు ఇచ్చిన ప్రాథమిక సమాచారం.