కనకదుర్గమ్మ.. అమ్మలగన్న అమ్మగా అంతటి పేరు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శక్తిస్వరూపం. అటువంటి అమ్మవారి ఆలయం చుట్టూ నిత్యం ఏదో ఒక వివాదం. టీడీపీ అధికారంలో ఉన్నపుడు క్షుద్రపూజలు చేశారనే వార్త దుమారం రేకెత్తించింది. టీడీపీలోని పెద్దలే దీనివెనుక సూత్రదారులంటూ వైసీపీ ఆనాడు విమర్శలు చేసింది. తిరుమల దేవస్థానం తరువాత అంతటి ఆదాయం తెచ్చే దేవాలయం విజయవాడ కనకదుర్గ అమ్మ వారి ఆలయం మాత్రమే. భక్తుల ముడుపులు, వందలాది ఎకరాల భూములు, కోట్లాదిరూపాయల సంపదతో అమ్మ తులతూగుతుంటుంది. అయినా అక్కడ ప్రభుత్వ పెద్దలు, అధికారుల చేతివాటంతో ఆలయ ప్రతిష్ఠ మసకబారుతోందనే ఆవేదన భక్తుల నుంచి వెల్లువెత్తుతోంది.
ఈ ఏడాది అమ్మవారి ఆలయంలోని నాలుగు వెండి సింహాలు మాయమవటం, ఒక సభ్యురాలి కారులో మద్యం సరఫరా చేయటం, చీరలను పక్కదారి పట్టించటం, అడ్డదారిలో టెండర్లతో అయినవారికి కాంట్రాక్టులు అప్పగించటం ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయి. దీన్ని బీజేపీ, జనసేన తరచూ వెలుగులోకి తెస్తున్నాయి. ఈవోగా సురేష్ నియామకంపై జనసేన ఎప్పటి నుంచో పోరాటం చేస్తోంది. న్యాయస్థానాన్ని ఆశ్రయింది. దీంతో ఆగమేఘాల మీద ప్రభుత్వం దిద్దుబాటుకు శ్రీకారం చుట్టింది. 14 మంది ఉద్యోగులను తొలగించింది. అసలు సూత్రదారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్‌బాబును మాత్రం ఏమి చేయలేక పోతుందనే ఆరోపణలున్నాయి. మంత్రి వెల్లంపల్లి అవినీతికి పాల్పడి.. ఈవో సురేష్‌బాబు నుంచి రూ.కోటి లంచం తీసుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. వరుసగా దేవాలయాలపై దాడులు, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నోటుదురుసు ఇవన్నీ వెల్లంపల్లికి చుక్కలు చూపుతున్నాయి. దేవాదాయశాఖ మంత్రి పదవి అంటేనే అప్పటి కనుమూరి బాపిరాజు నుంచి మాణిక్యాల రావు వరకూ గండాలతో ప్రయాణం చేశారు. సెంటిమెంట్‌గా కూడా దేవాదాయశాఖలో ఏ మాత్రం గాడితప్పినా భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పైగా స్పీకర్‌గా చేసిన వారికి భవిష్యత్ రాజకీయం ఎంత శూన్యంగా మారుతుందో.. దేవాదాయశాఖను సరిగా నిర్వర్తించని అమాత్యుల పని కూడా రాజకీయ వైరాగ్యమే అని నమ్మదగినంత ఉదంతాలున్నాయి. ఎటునుంచి చూసినా పాపం ఏపీ గుడుల మంత్రికి మున్ముందు మరింత కష్టకాలం చవిచూడాల్సిందేనేమో అంటూ వైసీపీ శ్రేణులు అమ్మవారి భక్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.