అమెరికా జలుబు చేస్తే భయపడుతుంది. ఫ్రాన్స్ కరోనాతో గుబులు పడుతుంది. చైనాకు ఇండియా అంటే వెన్నులో వణకు. మరి భారతదేశానికి.. అణుబాంబులు.. వైరస్‌లంటే పెద్దగా భయం లేదు. ఒక్క నిమ్మకాయ చాలు. అనేంతటి మూఢనమ్మకాల్లో ఇప్పటికీ కొట్టుమిట్టాడుతూనే ఉన్నాం. ఇంకా మనిషిలో దాగిన అనాగరిక ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. అమావాస్య, పౌర్ణమి భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. గాజువాకలో 17 ఏళ్ల అమ్మాయి వరలక్ష్మి దారుణ హత్య. ప్రేమ.. అనుమానం పెనుభూతంగా మారి చివరకు అమాయకురాలి ప్రాణాలు తీశాయి. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణకు బానిసగా మారినందుకు ప్రతిఫలం ఇలా ఉంటుందంటూ జరిగిన దారుణ ఘటనకు ఉదాహరణ. పరవు హత్యలు.. ప్రేమోన్మాద చర్యలు నిత్య కృత్యంగా మారాయి. కానీ.. వరలక్ష్మి హత్య వెనుక ప్రియుడు అఖిల్ మాత్రమే గాకుండా అతడి తండ్రి కూడా ఉన్నాడనే అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొడుకును సన్మార్గంలో పెట్టాల్సిన తండ్రి తన రౌడీబుద్దిని ప్రదర్శించి.. ఇంతటి అఘాయిత్యానికి పాల్పడటం విశాఖ పోలీసులకే కాదు.. యావత్ సభ్యసమాజాన్ని కూడా కలవరపాటుకు గురిచేస్తుంది. తాజాగా వెలుగుచూసిన మరో అంశం క్షుద్రపూజలు.. వరలక్ష్మిని చంపేందుకు పక్కా ప్లాన్ వేశారు. దీనివెనుక కేవలం ప్రేమ మాత్రమే గాకుండా.. 17ఏళ్ల వయసు గల యువతిని బలివ్వటం వల్ల జరిగే ఏవో ప్రయోజనాలు నిందితుల బుర్రలో ఉన్నాయనిపిస్తుంది. హత్య జరిగిన ప్రాంతంలో లభించిన నిమ్మకాయలు, నల్లటివస్త్రం, బియ్యం.. ఇలా క్షుద్రపూజలకు ఉపయోగించే వస్తువులు కనిపించటంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదంటున్నారు పోలీసులు.. కావాలనే పక్కా ప్లాన్‌తో చేసిన హత్యగా ప్రాథమికంగా నిర్ధారించారు.