పెళ్లిపీటలపై వధూవరులు కూర్చున్నారు. పెళ్లికి వచ్చిన బంధువులు.. ఆత్మీయులతో సందడిగా ఉంది. తాళికట్టబోతున్న వేళ స్టాపిట్ అనే మాట వినిపించింది. ఎవరదీ.. అని దిక్కులు చూసిన పురోహితుడు ఒక్క దెబ్బకు మూర్చపోయారట. ఇంతకీ ఆ పెళ్లి వద్దంటూ చెప్పిందెవరో కాదు.. పెళ్లిపీటలపై కూర్చున్న నవ వధువు. ఓర్నీ కలికాలం..అంటే ఇదేనేమో అనుకుని.. ఏం తల్లీ సృహలో ఉన్నావా.. ఏమైనా నిద్రలోకి జారుకున్నావా అంటూ పెద్దలంతా కదిపిచూశారు. పక్కనే కూర్చున్న వరుడు కూడా.. ఒక్కసారిగా ఉలికిపడి.. అంతలోనే తేరుకుని మళ్లీ తాళిబొట్టు చేతిలోకి తీసుకున్నాడు. తలవంచితే తాళి కట్టిబెడతానంటూ ప్రాధేయపడ్డాడు. అప్పటికీ కానీ.. ఆ యువతి నోరు విప్పలేదు. నాకీ పెళ్లి ఇష్టం లేదు. ఈ మొగుడు నాకు వద్దే వద్దు. అరగంట సేపు వెయిట్ చేస్తే.. ప్రేమించిన ప్రియుడు వస్తాడంటూ చావుకబురు చల్లగా చెప్పింది. అంతే.. ఒక్కసారిగా కుర్చీల్లో కూర్చున్నవారికి చెమట్లు పట్టాయి. తాము వచ్చింది. అసలు పెళ్లికా.. ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుందా అని చూశారు. ఈ మాట వింటూ బిక్కమొహం వేసిన వరుడు.. అమాయకుడుగా దిక్కులు చూడటం మినహా ఏం చేయాలో అర్ధమవక కాసేపు ఎదురుచూశాడు.
ఓస్ దీని సిగతరగా.. అంటూ పెళ్లికొచ్చిన ముత్తయిదవులు.. కావాలంటే.. ఇంటికెళ్లాక మొగుడుతో వాదులాట పెట్టుకోమ్మా.. అంటూ సర్దిచెప్పాలని ప్రయత్నించారు. అయినా.. ససేమిరా అంటూ ఆ యువతి రివర్స్ గేర్ వేయటంతో అవాక్కయ్యారు. ఒకరిద్దరు ఆమెను కొట్టేందుకు ప్రయత్నించి కూడా వెనకడుగు వేశారు. చివరకు వరుడు.. పోట్లాడే పెళ్లాంతో సర్దుకుపోతూ కాపురం చేయవచ్చు. కానీ.. ఇలా ఇష్టంలేని పెళ్లాంతో ఎలా అనుకుని.. ఎంచక్కా వెళ్లిపోయాడు.. వధువు తరపు వాళ్లు కూడా చల్లగా జారుకున్నారు. తల్లిదండ్రులు కూడా కళ్యాణమండపంలోనే కూతుర్ని వదిలేశారు. అరగంటకు వస్తానన్న లవర్.. గంటలు గడుస్తున్నా రాకపోవటంతో ఆ వధువు అక్కడే కూలబడిపోయిందట.