కమ్మరాజ్యంలో కడపరెడ్లు.. టైటిల్‌తో వర్మ సినిమా తీస్తే జస్ట్ ఫన్ అనుకున్నారు. ఏపీలో రెడ్డి వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారంటూ టీడీపీ ఘాటుగానే స్పందించింది. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ కమ్మ సామాజికవర్గ అధికారులకే పెత్తనం ఇచ్చిందంటూ వైసీపీ ఎన్నికల సంఘానికి లేఖరాయటం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ప్రస్తుతం అమరావతి రాజధాని తరలింపు కూడా కేవలం కమ్మసామాజికవర్గంపై కక్ష సాధింపు చర్యగానే టీడీపీ శ్రేణులు లెక్కలు కడుతున్నాయి. వైసీపీ నేతలు కొందరు అమరావతిని కమ్మరావతిగా సంబోధిస్తూ తక్కువ చేయటం కూడా ఏపీ ప్రజల కళ్లెదుట జరిగినదే. సోషల్ మీడియాలో కామెంట్స్‌పై పోలీసులు, సీఐడీ అధికారులు నమోదు చేస్తున్న కేసుల్లోనూ ఇతర సామాజికవర్గాలే బాధితులు అనే ఆరోపణలున్నాయి. 2014 కలసి నడచిన కాపు, కమ్మ వర్గాలు 2019 నాటికి విడిపోవటానికి ప్రధాన కారణం.. తమకు ఇస్తామన్న బీసీ రిజర్వేషన్‌పై చంద్రబాబు వైఖరి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబంపై దమనకాండ కూడా టీడీపీ పట్ల వ్యతిరేకతను పెంచింది. జనసేనాని కూడా బాబు , లోకేష్ అవినీతిని ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అయితే.. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన ఒక్కటే అనే అంశాన్ని వైసీపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఫలితంగా కాపు ఓటర్లు… టీడీపీ వ్యతిరేక ఓట్లు వైసీపీ బ్యాలెట్‌లోకి చేరాయి.
2004-14 వరకూ కాంగ్రెస్ పార్టీ హయాంలో రెడ్డి, కాపు సామాజికవర్గాలు రాజకీయంగా.. ఆర్ధికంగా ఒకరికొకరు సహకరించు కున్నా యి. బలపడ్డాయనే చెప్పాలి. 2014-19 వరకూ టీడీపీ సరికొత్త ఎత్తుగడతో పవన్ ద్వారా కాపుల ఓట్లకు గాలమేసి నెగ్గారు. 2019లో రెడ్డి, కాపు, కమ్మ మూడు సామాజికవర్గాల భిన్నధ్రువాలుగా మారతాయనే భావించారు. కానీ.. టీడీపీ తప్పిదాలతో కాపు, రెడ్డి వర్గాలు మళ్లీ చేరువయ్యాయి. ఫలితంగా.. కాపులు చేపట్టి బీసీ రిజర్వేషన్ ఉద్యమం దాదాపు అటకెక్కినట్టుగానే లెక్కలు కట్టాల్సి వస్తోందని కాపు నేతలు వాపోతున్నారు. నిజానికి కాపు రిజర్వేషన్ అంశం కేంద్ర పరిధిలోనిదంటూ టీడీపీ చివరి నిమిషంలో చెప్పి.. వైసీపీ నెత్తిన పాలుపోసింది. అందుకే.. జగన్ కూడా కాపుల రిజర్వేషన్‌పై ప్రయత్నిస్తానంటూ మాత్రమే హామీనిచ్చారు. కేంద్రంలో కాపుల తరపున గొంతువిప్పే సమర్థుడైన నాయకుడు లేకపోవటంతో అది కేంద్రం చెవికి చేరకుండా పోయింది.
ఇదే సమయంలో కాపు ఉద్యమ సారధి.. ముద్రగడ పద్మనాభం తాను ఉద్యమం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. దీన్ని తాము కంటిన్యూ చేస్తామంటూ హస్తం సీనియర్ నేత చేగొండి హరిరామ జోగయ్య ముందుకు వచ్చారు. 80 ఏళ్ల వయసులో ఆయన ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారనే ప్రశ్నకు సమాధానం కూడా కరవైంది. రాజకీయ ప్రాభవం కోసం పాకులాడే కాపు ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వంతో కాపు రిజర్వేషన్‌పై మాట్లాడలేకపోతున్నారు. ఫలితంగా.. కాపు ఉద్యమాన్ని నడిపించే నాయకుడు ఎవరనేది ప్రశ్నార్ధకంగానే మిగిలింది.
ప్రతిపక్ష నేతగా జగన్‌పై కక్షసాధింపులో కమ్మ సామాజికవర్గ కీలకంగా వ్యవహరించందనేది వైసీపీ శ్రేణుల అభిప్రాయం. అందుకే ప్రతీకారం తీర్చుకునేందుకు కమ్మ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులను వైసీపీ సర్కారు లక్ష్యంగా చేసిందనే ఆందోళన లేకపోలేదు. దీన్నుంచి బయటపడాలనే ఉద్దేశంతో చింతమనేని, యరపతినేని, దేవినేని, కేశినేని వంటి కమ్మ వర్గంలో మంచి పట్టున్న నేతలు కూడా ఆచితూచి స్పందిస్తున్నారనే గుసగుసలూ లేకపోలేదు. వల్లభనేని వంశీ, కరణం బలరాం, దేవినేని అవినాష్ వంటి కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు కూడా జగన్‌తో తలపడేకంటే.. రాజీపడటం ఉత్తమం అనుకుని వైసీపీ పంచన చేరారు. కమ్మ, కాపు సామాజికవర్గాల్లోనూ గ్రూపులుగా మారటంతో.. రెండు వర్గాలు మరింత బలహీనం కానున్నాయి. ఫలితంగా మూడో వర్గం ఆధిపత్యం సంపాదించేందుకు దారిచూపారు. వైసీపీ ఎత్తుగడతో అటు కాపు ఉద్యమానికి పుల్‌స్టాప్ పడినట్టయింది. ఇటు కమ్మ సామాజకవర్గ ప్రాభవానికి గండిపడినట్టయిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.