టీడీపీ పునాదులు బీసీ వర్గమని చెబుతున్నా.. ఎదుగుదలలో కమ్మ సామాజికవర్గానిదే కీలక భాగస్వామ్యం. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ అన్ని పదవులు రెడ్లకేనంటూ పెడబొబ్బలు పెడుతున్న టీడీపీ చేసింది కూడా అదే.. 1984 నుంచి 2014 వరకూ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ టీడీపీ సర్కారు నుంచి లాభపడిన వారెవరైనా ఉన్నారంటే.. ఎక్కువశాతం కమ్మవర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు, అధికారులే ఉంటారు. గత ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమికి కారణం కూడా కమ్మవర్గ వ్యతిరేకత అనేది బహిరంగ రహస్యం. దీన్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లటంలో ప్రశాంత్ కిషోర్ ఎత్తుగడ ఫలించింది. దీనికి తగినట్టుగానే గత ఎన్నికల్లో కమ్మ వర్గ ఓటర్లు ప్రభావం ఉన్న అధికశాతం అసెంబ్లీ నియోజకవర్గాల్లో అకస్మాత్తుగా వైసీపీ అదిష్ఠానం అభ్యర్థులను మార్చింది. కమ్మ వర్గానికి చెందిన వ్యాపార, పారిశ్రామిక వేత్తలను బరిలోకి దింపింది. ఫలితంగా దశాబ్దాలుగా టీడీపీ ఓటమి చూడని నియోజకవర్గాల్లోనూ పరాజయం తప్పలేదు. గతంలో టీడీపీకు స్తంభాలుగా నిలిచిన ముద్దు కృష్ణమనాయుడు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, బుచ్చయ్యచౌదరి వంటి చాలా మందిని చంద్రబాబు దూరంగా ఉంచారు. కొత్త వాళ్లకు ప్రాధాన్యతనివ్వటం.. లోకేష్ అన్నీ తానై సీనియర్లను పక్కకు నెట్టేయటం కూడా సీనియర్లను బాధకు గురిచేసింది. గత ఎన్నికల్లో గెలుపు కోసం జనసేనతో మైత్రి.. కాపులకు మంత్రి పదవులు కట్టబెట్టడం కూడా కమ్మ వర్గంలో వ్యతిరేకతకు కారణమైంది. అటు బీసీలు, ఇటు కమ్మ వర్గ నేతలు దూరం కావటం.. అదే సమయంలో టీడీపీ కేవలం కమ్మ న్యాయమే అనే ప్రచారాన్ని ఇతర కులాలపై ప్రభావం చూపటం జరిగాయి.
ఇప్పుడు టీడీపీ మరోసారి బీసీ పల్లవి అందుకుంది. అచ్చెన్నాయుడుని ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా చేయటం ద్వారా తాము బీసీల వైపు అనే సంకేతాలు పంపాయి. వైసీపీలోని కమ్మ, కాపు, రెడ్డి వర్గ నేతల మధ్య కూడా అంతర్గత వైరం కొనసాగుతోంది. అయినా కూడా కమ్మ వర్గానికే వైసీపీ అధినేత జగన్ ప్రాధాన్యత ఇస్తున్నాడనే సంకేతాలు పంపేందుకు కొడాలి నానిని కోస్తా జిల్లా
ల్లో కీలక నేతగా మలిచారు. వసంత కృష్ణప్రసాద్, కోన రఘుపతి, కరణం బలరాం, విజ్ఞాన్ కళాశాలల చైర్మన్ రత్తయ్య తనయుడు లావు కృష్ణదేవరాయలు వంటి వారికి ప్రాముఖ్యతను పెంచారు. దీంతో వైసీపీలోని కమ్మ నేతలతో టీడీపీలోని కమ్మ నాయకులపై మాటల యుద్ధం చేయిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుపై వ్యతిరేకత ఉన్న కమ్మ వర్గ నేతలను వైసీపీ తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తోంది. జనసేన వైపు కాపులు పూర్తిగా వెళ్లిపోతే.. కమ్మ , రెడ్డి వర్గాలతో కొత్త రాజకీయాలకు తెర తీయవచ్చనేది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. ఈ ప్లాన్ వర్కవుట్ అయితే.. టీడీపీను కాపాడుతూ వస్తోన్న కమ్మ వర్గంపై పై చేయి సాధించినట్టే అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.