అ అంటే అరక.. ఆ.. ఆట. ఇది తెలుగు బాష. క ఫర్ కమ్మ.. కా.. అంటే కాపు.. కమలం పార్టీ కొత్త గుణింతం తెరమీదకు తెచ్చింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం ఇదే ఫార్ములాతో సక్సెస్ కొట్టింది. 2019లో అదే రివర్స్‌లో దెబ్బతీసింది. ఇది గతం.. మరి ఇప్పుడు ఇదే పాయింట్‌తో 2024లో ఎలాగైనా మాంచి విజయం సాధించాలనే వ్యూహంతో బీజేపీ పావులు కదిపింది. కొండకు వెంట్రుక వేసినట్టుగానే కమలనాథులు భావించి ఉండవచ్చు. ఎందుకంటే. ఏపీలో భిన్న కులాలను సమీకరించి ఏకతాటిపైకి తీసుకురావటం సవాల్. గతంలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాపు ఉద్యమ నేత వంగవీటి మోహనరంగా కాపునాడు పేరుతో మైనార్టీ, ఎస్సీలు, కాపులను ఒకేచోటకు చేర్చాలనే ప్రయత్నంతో సభ పెట్టారు. అది సక్సెస్ అయింది..
కానీ.. ఆ తరువాత రంగా దారుణహత్యతో అదంతా కలగానే మిగిలింది. ప్రజారాజ్యాపార్టీ సమయంలోనూ చిరంజీవి కూడా కాస్త ప్రయత్నం చేసినా వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ముందు పేలవంగా మిగిలింది. కానీ 2009 వరకూ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీలో అధికారం చేపట్టిన ప్రతిసారి కాపులు, ఎస్సీలు హస్తం వెంట నడిచారు. రెడ్లకు అధికారం కట్టబెట్టడంలో సాయపడ్డారు. 2019లోనూ వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి అప్పటికే టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత క్రమంగా కమ్మ సామాజికవర్గంపై ప్రతికూలంగా మారటాన్ని తెలివిగా ఓటుబ్యాంకుగా మలచుకున్నాడు. 151 సీట్లు కొల్లగొట్టాడు.

బీజేపీ కూడా ఏపీ కుల సమీకరణలను అనువుగా మార్చుకోవాలనే ప్లాన్‌తోనే ఉంది. దీనిలో భాగంగానే ఏపీ బీజేపీ బాధ్యతలను కన్నా లక్ష్మినారాయణకు అప్పగించింది. దీంతో అప్పటికే కమలం గూటిలో ఉన్న పురందేశ్వరీ, కావూరి సాంబశివరావు, కంభంపాటి మోహన్‌రావు, సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్ వంటి కమ్మ వర్గ నేతలు పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టుగా ఉన్నారు. అప్పటికే కమ్మవర్గం కన్నాను తీవ్రంగా వ్యతిరేకించేవారు. చంద్రబాబుపై కన్నాకు ఉన్న ద్వేషం కూడా దీనికి కారణం. వంగవీటి రంగా ప్రధాన అనుచరుడుగా కన్నాకు కాపు వర్గంలో గుర్తింపు ఉంది. దీన్నుంచి బయటపడి.. అదే కాపు వర్గానికి చెందిన సోము వీర్రాజుకు బీజేపీ పగ్గాలు అప్పగించింది. ఇది కూడా కమ్మ నేతల్లో వ్యతిరేకతను రగిలించింది.
అందుకే.. కమ్మ వర్గాన్ని కూడా పార్టీలో కీలకమని చెప్పేందుకు తాజాగా జాతీయ రాజకీయాల్లో దగ్గుబాటి పురందేశ్వరి ఉరఫ్ చినమ్మను చేర్చుకున్నారు. ఇప్పటికే జనసేన, బీజేపీ మధ్య పొత్తుతో కాపులు కమలం వైపు ఉంటారనే అభిప్రాయానికి వచ్చారు. ఇటీవల రెండుపార్టీలు కలసి చేసిన పలు ఉద్యమాలు కూడా విజయవంతమయ్యాయి. మరోవైపు వైసీపీ కమ్మ వర్గానికి చెందిన ప్రభుత్వ అధికారులు, రాజకీయనేతలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడం.. జైళ్లకు పంపటంతో పాటు. అమరావతి రాజధాని తరలింఉ కూడా వైసీపీ పట్ల కమ్మ వర్గంలో వ్యతిరేకతను పెంచింది. దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలనేది బీజేపీ వ్యూహం. ఎన్టీఆర్ వారసురాలిగా పురందేశ్వరిని రంగంలోకి దింపారు. బీసీ రిజర్వేషన్ ఇస్తానంటూ తూచ్ చెప్పిన వైసీపీ ప్రభుత్వాన్ని ద్వేషిస్తున్న కాపులతో దోస్తీ చేస్తుంది. అసలే నిప్పు.. ఉప్పులా ఉండే ఈ రెండు సామాజికవర్గాల కలయికతో కొత్తగా చెబుతున్న క.. గుణింతం కమలం పార్టీ ఆశలను ఎంత వరకూ నెరవేరుస్తుందనేది కాలమే చెప్పాలి.



