కాపు.. ఏపీలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న సామాజికవర్గం. అనైక్యత కారణంగా ఐదేళ్లకోసారి ఎవరో ఒకరి పంచన చేరుతూ పలుచనగా మారుతున్నారు. అధికశాతం ఓటర్లు.. సామాజికవర్గం ఉన్న చోట కూడా కాపు నేతలను పక్కకు నెట్టేస్తూ.. తమ వారికే ఆయా రాజకీయపార్టీలు టికెట్లు కేటాయిస్తున్నాయి. అక్కడ కాపులను విడదీయటం ద్వారా రాజకీయ లబ్దిపొందుతున్నాయి. 1984 నుంచి 2019 వరకూ ఇదే జరుగుతూనే ఉన్నా ఆ వర్గంలో ఇప్పటికీ జ్ఞానోదయం కాలేదంటూ కాపు వర్గ నేతలు ఆవేదన వెలిబుచ్చుతున్నవారూ లేకపోలేదు. కాపులకు బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఆశచూపుతూ ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తరువాత టీడీపీ రెండూ పబ్బం గడుపుకున్నాయి. 2004లో వైఎస్ సీఎం అయ్యేందుకు కాపులకు సీట్లు కట్టబెట్టారు. రిజర్వేషన్ అంశంపై నోరు నొక్కేశారు. 2014లో ఇదే కాపు వర్గ ఓట్ల కోసం చంద్రబాబు బీసీ రిజర్వేషన్ ఇప్పిస్తానంటూ గెలిచాక.. కాపు కార్పోరేషన్ అంటూ మాట మార్చారు. 2019లో పవన్‌ను కాపు నేతగా కాపు వర్గం చేరువ అయినా.. వైసీపీ చేసిన చంద్రబాబు, పవన్ ఒక్కటే అనే ప్రచారం కాపు వర్గాన్ని పవన్‌కు దూరం చేసింది. ఏడాదిన్నర వ్యవధిలో కాపువర్గ నేతలు, జనసేన కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు. పవన్‌ను రెండుచోట్ల ఓడిపోవటాన్ని వైసీపీ క్యాష్ చేసుకుంటోంది. వైసీపీలోని కాపు నాయకులు పేర్ని నాని, ఆళ్లనాని, అవంతి శ్రీనివాస్ తదితరులు పవన్‌పై విషం కక్కుతున్నారు. ఇది సహజంగానే కాపు సామాజికవర్గంలో వ్యతిరేకతకు కారణమవుతోంది. పవన్‌ను ఓడించినందుకు ఎంత నష్టపోయామనే విషయాన్ని గుర్తించారంటున్నారు జనసైనికులు.. 2024 నాటికి.. పవన్ వైపు నడిచేందుకు కాపు వర్గ నాయకులు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఏపీలో పవన్ పర్యటనలోనూ పాగ పగలు పక్కనబెట్టిన కాపు వర్గ నేతలంతా ఏకతాటిపైకి వచ్చారు. జనసేనాని పర్యటనను విజయవంతం అయ్యేలా ముందుకు వచ్చారు. ఇదే స్పూర్తిని.. 2024 వరకూ కొనసాగించేలా.. కాపులు ఏకతాటిపైకి వస్తారంటూ కాపు వర్గ నాయకులు ఆత్మవిశ్వాసం వ్యక్తంచేస్తున్నారట.