చంద్రబాబుకు కమ్మ సామాజికవర్గం.. జగన్ మోహన్ రెడ్డికి రెడ్డి వర్గీయులు మద్దతు చెబితే అది కుల పార్టీలు కాదా! జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు కాపులు అనుకూలంగా ప్రకటన చేస్తే జనసేన కాపుల పార్టీగా మారుతుందా! అంటూ జనసైనికులు నిలదీస్తున్నారు. కాపుల రిజర్వేషన్‌పై టీడీపీ, వైసీపీ రెండూ ఒకే రకమైన వైఖరితో ఉన్నాయంటున్నారు కాపు వర్గ నేతలు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఊహించని విధంగా జనసేన బలపరచిన అభ్యర్థులు గెలిచారు. పార్టీలకు అతీతంగా పలు పల్లెల్లో కాపులు, దళితులు, మైనార్టీలు ఏకతాటిపైకి వచ్చారు. ఇదే మున్ముందు మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కొనసాగితే వైసీపీ, టీడీపీలకు ఊహించని దెబ్బ పడుతుందనే అభిప్రాయం కూడా మొదలైంది.
తిరుపతి ఉప ఎన్నికలో తాము పవన్‌కు మద్దతుగా నిలుస్తామంటూ రాయలసీమకు చెందిన బలిజ సంఘాలు సమావేశంలో తీర్మానించాయి. జనసేనకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశాయి. ఇది తొలిసారిగా ఒక సామాజికవర్గం బయటకు వచ్చి తమ వర్గానికి చెందిన నేతకు సంఘీభావం చెప్పటం అంటున్నారు విశ్లేషకులు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలతో సహా పలు సీమ మండలాల్లోనూ పవన్‌ను కాపు, ఒంటరి, బలిజలు తమ వాడిగానే భావించి పవన్‌కళ్యాణ్ పార్టీ వైపు ఉంటామంటూ బాహాటంగా ప్రచారం చేశారు. 2014లో టీడీపీ కాపులకు రిజర్వేషన్ ఇస్తామంటూ నెగ్గాక.. ఐదేళ్లు తాత్సారం చేసింది. వైసీపీ ఎన్నికల ముందు హామీనిచ్చింది.. 2019లో గెలిచాక.. తూచ్.. అది కేంద్ర పరిధిలోనిదంటూ మడెం తిప్పారు. ఇవన్నీ కాపుల్లో ఆగ్రహం తెప్పించినా.. సరైన నాయకత్వం లేకపోవటంతో కాస్త వెనుకంజ వేస్తూ వచ్చారు. ఇటీవల పవన్ కాపులు రాజ్యాధికారం సాధించాలంటూ ఇచ్చిన పిలుపు గట్టిగానే పనిచేసింది. ఇతర పార్టీలకు కొమ్ము కాస్తున్న నేతలు కొందరు బయటకు వచ్చారు. ఇవన్నీ రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. జనసేన కేవలం కులపార్టీ అనే ముద్రను దూరం చేసేందుకు పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా దళితులు, మైనార్టీ వర్గాలు మద్దతునిచ్చాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో కాపు పెద్దలు చేయలేని ధైర్యం.. ఇప్పటి కాపు యువత చేయటం విశేషం.