తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మళ్లీ మోదీపై కోపం వచ్చింది. 2018 ముందస్తు ఎన్నికల్లో గెలిచాక.. 2019 సార్వత్రిక ఎన్నికలపుడు మూడో కూటమి కట్టాలని తెగ ఉబలాటపడ్డారు. అటు మమతా బెనర్జీ నుంచి ఇటు ముఫ్తీ వరకూ అందరూ ఏమన్నా.. కేసీఆర్ మస్త్ డిసైడ్ చేసినవ్.. ఈ దెబ్బకు మోదీ ఫసక్ అంటూ తెగ ఫోన్లు చేసి మరీ మద్దతు ప్రకటించారు. కానీ ఆ ఎన్నికల్లో నరేంద్రుడి హవాకు కుదులైన కూటమి సభ్యులంతా మళ్లీ సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు కేసీఆర్‌కు ఢిల్లీపై దండయాత్ర చేయాలనేంతగా కోపం వచ్చింది. ఎందుకంటే.. రైతు చట్టాల పేరుతో నానాయాగీ చేసిన మోదీ అన్నదాత కడుపు కొడతాడా! అయినా.. రైతుబంధు, గొర్రెలు, బర్రెల పంపిణీతో దేశానికి ఆదర్శంగా ఉన్న కేసీఆర్ కు కోపం తెప్పించాడు. సన్నబియ్యం కొంటామని.. మక్కలకు మద్దతు ధర ఇస్తామని చెప్పి తెలంగాణ రైతులకు ఝలక్ ఇచ్చిన కేసీఆర్‌కు కేంద్రంపై కోపం నషాళానికి అంటింది. అందుకే.. ఆగమేఘాల మీద పార్టీను సమావే శ పరిచాడు. మీరేం చేస్తారో నాకు తెల్వదు. 8వ తారీకు భారత్‌బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాం. గల్లీలో ఒక్క పురుగు కూడా కనిపించకూడదు. ఎవ్వలూ రోడ్ల మీదకు రాకూడదంటూ ఆర్డర్ జారీ చేశారు మంత్రి కేటీఆర్. అసలే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవాన్ని మిగిల్చింది. అందుకే.. దానికి ప్రతీకారంగా రేపు ఢిల్లీ దద్దరిల్లేలా హైదరాబాద్ నుంచే శంఖారావం పూరించబోతున్నారు. పనిలో పనిగా జమిలీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమిని మట్టి కరిపించేందుకు ఇప్పటి నుంచే మనం కసరత్తులు చేసి కండలు పెంచాలంటూ గులాబీ పార్టీకు హితభోధ కూడా చేశారు.
అంత వరకూ బాగానే ఉంది.. గుజరాత్ ఛాయ్‌వాలాపై కోపం తీర్చుకోవాలనేది కూడా ఓకే. ఎప్పుడూ ఉత్తరాధి పెత్తనమేనా.. దక్షిణాధి వాళ్లంతా జీ హుజూర్ అంటూ చేతులు కట్టుకోవటమేనా! అనే పిలుపు కూడా సూపర్. మరి.. అంత సత్తా ఉన్న ఉత్తరాది మందిని దెబ్బతీసేందుకు ఒక చంద్రశేఖర్, ఒక జగన్.. ఒక చంద్రబాబు.. స్టాలిన్, మమతా బెనర్జీ వంటి వాళ్లు సరిపోతారా. గట్టిగా నాలుగు హిందీ ముక్కలు మాట్లాడలేని నేతలు.. ఉత్తరాదిన మోదీ వ్యతిరేక వర్గాన్ని ఎలా సమీకరరిస్తారు. కమ్యూనికేషన్ లేకుండా ఎలా ఏకతాటిపైకి తీసుకొస్తారనే భయం కూడా లేకపోలేదు. ఏమైనా.. ఢిల్లీపై దండయాత్ర అంటే.. కొండను వెంట్రుక వేసి లాగటమే.. వస్తే కొండ.. పోతే వెంట్రుక.. దీనివల్ల పోయేదేమింది.. వెంట్రుక తప్ప అనేంతగా వీరత్వమే మూడో కూటమి అసలు రూపమంటూ బీజేపీ శ్రేణులు తెగ ఎద్దేవా చేస్తున్నాయి సుమా..