ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట గులాబీ కోటకు యువరాజుగా ఉన్న కేటీఆర్ మహారాజుగా కిరీటీ ధరిస్తారని. ఇప్పుడు అదే నిజమవుతోంది. అవును.. తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు ఉరఫ్ కేటీఆర్ త్వరలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. దీనికోసం మంచి ముహూర్తం కూడా ఖరారైందట. ఇక మిగిలింది.. పట్టాభిషేకమేనంటూ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతేడాది నుంచే కేటీఆర్ సీఎం అంటూ ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. దీనికి బలం చేకూర్చేలా శాసనసభ ఉప సభాపతి పద్మారావు కూడా కేటీఆర్ సమక్షంలోనే కాబోయే సీఎం కేటీఆర్ అంటూ ప్రసంగించారు. మంత్రి తలసాని, శ్రీనివాస్‌గౌడ్ వంటి వాళ్లయితే ఎప్పటి నుంచే మంత్ర జపం చేస్తున్నారు. కేసీఆర్ మనసులో ఉన్న మాటనే అమాత్యులు వల్లెవేస్తున్నారంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే.. తెలుగు రాష్ట్రాల్లో సీఎంలుగా పనిచేసిన వారి వారసులు సీఎంగా ప్రమాణస్వీకారం చేయటంలో కేటీఆర్ రెండో వ్యక్తిగా మిగులుతారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకూ ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ.. 2019 వరకూ అప్పటి సీఎంలుగా పనిచేసిన వారి కుమారులు/ కూతుళ్లు గానీ ఆ పీఠంపై చేరలేకపోయారు.
2019 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు జగన్ మోహన్‌రెడ్డి సీఎంగా రికార్డు సృష్టిస్తారు. ఇప్పుడు ఆదే దారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా జగన్ బాటలో సీఎం అయినట్టే లెక్క. అయితే కేసీఆర్ ఇప్పుడే అంత త్వరగా ఈ నిర్ణయం తీసుకుంటారా! అనే సందేహం లేకపోలేదు. ఆరోగ్యపరంగా బాగానే ఉన్నానంటూ ఎప్పుడో చెప్పారు. కేటీఆర్ కూడా 2030 వరకూ కేసీఆర్ సీఎం అంటూ గత ఎన్నికల్లో విజయం తరువాత ప్రకటించారు. అయితే పార్టీపై పట్టు సాధించిన తరువాతనే కేటీఆర్‌కు పట్టాభిషేకం చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఆరేళ్లపాటు వేచిచూశారు. ప్రస్తుతం కేటీఆర్ పార్టీపరంగా బలంగా ఉండటం.. పార్టీ శ్రేణులపై పట్టు సాధించటం కూడా జరిగాయి. అయితే కేటీఆర్‌కు వ్యతిరేకవర్గంగా పేరున్న మంత్రులు ఈటల, గంగుల, సీనియర్లు కొందరు మాత్రం… తమ సీటుకు కేటీఆర్ రాకతో ఆశలు వదల్చుకోవాల్సి వస్తోందనే ఆందోళన లేకపోలేదు. మరి. దీనిపై కేటీఆర్ ఎలా స్పందిస్తారు.. సీఎం పీఠంపై తన అంతరంగం ఏమిటనేది ఎప్పుడు ప్రకటిస్తారనేది ఉత్కంఠతగా మారింది. హరీష్‌రావు, కవితల ఆలోచన ఇంకెలా ఉందనేది మరో ప్రశ్న.