అక్షరం అజ్ఞానాన్ని తరిమేసే ఆయుధం

విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వాలకు ప్రజలు మద్దతునివ్వాలని మాజీమంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ పిలుపునిచ్చారు. బడుగు, బలహీనవర్గాలకు చదువు, ఆరోగ్యం బాగునప్పుడే నాగరికత అభివృద్ధి వైపు పయనిస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రామన్నపేటలోని మద్యవిమోచన ప్రచార కమిటీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించగా.. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కార్యక్రమానికి ముందుగా ప్రముఖ సినీనటుడు జయప్రకాష్ రెడ్డి మృతికి సంతాపంగా కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ‘నాడు-నేడు’ కార్యక్రమం అమలు విప్లవాత్మక నిర్ణయమని కొనియాడారు. దీంతో విద్య, వైద్యాలయాల అభివృద్ధి తధ్యమన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్ధికంగా చితికిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం జగన్ సంక్షేమ పథకాలు దోహదపడుతున్నాయని చెప్పారు.

అమ్మ ఒడి, జగనన్నగోరుముద్ద, చేయూత, చేదోడు వంటి పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా డబ్బు పంపిణీ చేస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని పిలుపునిచ్చారు. ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పై ప్రభుత్వం చిత్తశుద్ధిలో భాగంగా అంగన్ వాడీల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ను అధికారికంగా అమలు చేయడం విప్లవాత్మకచర్యగా చెప్పారు. గతంలో తాను సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమంలో భాగంగా భారత జ్ఞాన విజ్ఞాన సమితి తరఫున ఉమ్మడి ఆంధ్రలోని 23జిల్లాల్లో 12లక్షలమంది వాలంటీర్లు పనిచేశారని చెప్పారు. దివంగత బీపీఆర్ విఠల్ తో పాటు తాను పనిచేసిన జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.విద్య పెంచుకోండి.. విద్య పంచుకోండనే బీపీఆర్ విఠల్ నినాదాన్ని లక్ష్మణరెడ్డి గుర్తుచేశారు.

అక్షరాస్యత కార్యక్రమాల ద్వారా ప్రజాచైతన్యం పెరిగి నెల్లూరు జిల్లాలో సంపూర్ణమద్యనిషేదం మొదలైందన్నారు. 90లక్షల మంది డ్వాక్రా మహిళలు, ఎనిమిది లక్షల గ్రూపులు కేవలం అక్షరాస్యతతోనే ఏర్పడ్డాయని లక్ష్మణరెడ్డి గుర్తుచేశారు. అక్షరాస్యతతో శిశుమరణాల రేటు తగ్గుతుందని, మౌనసంస్కృతి నిర్మూలించబడుతుందన్నారు. 2024నాటికి ఏపీలోని అక్షరాస్యత మొదటి పదిస్థానాలకు చేరాలని, ఆమేరకు ప్రభుత్వంతో పాటు సామాజిక సంఘాల సహకారం అనివార్యమన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో అక్షరాస్యత పెరిగినప్పుడే ప్రజాసాధికారత సాధ్యమన్నారు. ఆరోగ్యం, విద్యలో మనం కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా స్వీకరించాలన్నారు.

అక్షరాస్యత పెంచాలనే రాజకీయధృఢ సంకల్పం ప్రభుత్వాలకు ఉన్నప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచీకరణ, ఐటీ అభివృద్ధి పేరుతో అక్షరాస్యతను గాలకొదిలేశారని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాల్లో అక్షరాస్యత పెరగడంతోనే జనాభానియంత్రణ సాధ్యమైందన్నారు. అధికార భాషాసంఘ సభ్యులు, ప్రొఫెసర్ మస్తాన్ మాట్లాడుతూ చదువుతో ప్రశ్నించే తత్వం అలవడుతుందన్నారు. మాజీ ఎస్పీ అధికారి చక్రపాణి మాట్లాడుతూ గ్రామాల్లో వయోజన విద్య ఆవశ్యకతను ప్రభుత్వం మరోమారు గుర్తెరగాలన్నారు. వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర నాయకులు మేరిగ విజయలక్ష్మి మాట్లాడుతూ బడుగువర్గాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడితేనే విద్యకు మక్కువ చూపుతారని చెప్పారు. జనచైతన్య వేదిక తరఫున డాక్టర్ పి. పోతురాజు వందన సమర్పణ చేశారు. సమావేశంలో అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, కొండవీడు అభివృద్ధి కమిటీ కన్వీనర్ శివారెడ్డి, చైతన్యగోదావరి గ్రామీణ బ్యాంకు చీఫ్ మేనేజర్ వీరారెడ్డి, నాగార్జునసాగర్ కళాశాల ప్రిన్సిపాల్ డి.పేరిరెడ్డి, సముద్రాల కోటేశ్వరరావు, మాజీ ప్రిన్సిపాల్ వైవీ శివప్రసాద్, మాజీ అధ్యాపకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రయివేటు విద్యాసంస్థల సంఘం సభ్యులు మేకల రవీంద్రబాబు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here