అప్పుడు అమృత.. ఇప్పుడు అవంతి.. ఆ నాడు మారుతీరావు.. ఇప్పుడేమో లక్ష్మారెడ్డి. అవే పరవుహత్యలు.. కూతుళ్ల జీవితాన్ని నాశనం చేస్తున్నామనే విచక్షణ మరచి పగ ప్రతీకారంతో అల్లుళ్లను దారుణంగా హత్య చేయించారు. ఇష్టంలేకుండా కూతురిని పెళ్లిచేసుకున్నాడని ఓ తండ్రి దారుణానికి తెగబడ్డాడు. అల్లుడిని దారుణంగా హత్య చేయించాడు. ఇదంతా ఏ మూరు మూల పల్లెలోనే కాదు.. ప్రపంచంలో ఐటీ మేటిగా ఎదిగిన హైటెక్ సిటీ ప్రాంతంలో పరవుహత్య జరిగింది. గచ్చిబౌలికి చెందిన అవంతిరెడ్డి, అదే ప్రాంతంలో ఉండే హేమంత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొద్దికాలంగా అక్కడే నివాసం ఉంటున్నారు.. అవంతిరెడ్డి తండ్రికి మాత్రం ఇది నచ్చలేదు. అంతే.. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే పథకం వేశాడు. సుపారీగ్యాంగ్‌తో ఒప్పంద కుదుర్చుకుని హేమంత్‌ను హత్య చేయించేందుకు సిద్ధమయ్యాడు. దానిలో భాగంగా గురువారం స్కెచ్ గీశారు. కూతురు, అల్లుడిని కిడ్నాప్ చేసి.. సంగారెడ్డి వైపు తీసుకెళ్లారు.
కారులో కిడ్నాప్ దారుల నుంచి తప్పించుకున్న అవంతి పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. అయితే.. పోలీసులు సకాలంలో స్పందించకపోవటంతో సుపారీగ్యాంగ్ హేమంత్‌ను చంపేసి పొలాల్లో పడేసి వెళ్లిపోయారు. శుక్రవారం అవంతి రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. యువతి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించటంతో అసలు విషయం బయటకు వచ్చింది. యువతి తండ్రి లక్ష్మారెడ్డి ఇచ్చిన సమాచారంలో సంగారెడ్డి సమీపంలోని కృష్ణాపూర్‌లో హేమంత్ మృతదేహం ఉన్నట్టు చెప్పటమే గాకుండా చూపాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ మహానగరంలో పరవు హత్యతో ఒక్కసారిగా జనం ఉలికిపాటుకు గురయ్యారు. ప్రేమించి పెళ్లిచేసుకున్న నేరానికి నిండు ప్రాణం తీయటంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్-అమృత ప్రేమపెళ్లి వివాదంలోనే అమృత తండ్రి మారుతీరావు కూడా ప్రణయ్‌ను సుపారీ ముఠాతో మర్డర్ చేయించటం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ఆ తరువాత జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన మారుతీరావు కూతురిని దగ్గరకు రప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలయ్యాయి. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన మారుతీరావు.. హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్నాడు. పరవు కోసం హత్య చేసిన తండ్రి ప్రయాణం అలా ముగిసింది. ఇప్పుడు అదే దారిలో లక్ష్మారెడ్డి చేసిన దారుణంపై ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. పోలీసులు కూడా కేసు నమోదుచేసి సుపారీగ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. అవంతి మేనమామ హత్యలో కీలకంగా వ్యవహరించినట్టు నిర్ధారణకు వచ్చారు. అతడే హేమంత్ మెడకు తాడు బిగించి హత్య చేసినట్టుగా భావిస్తున్నారు.
అవంతరెడ్డి కిడ్నాపర్ల నుంచి బయటపడి ఫోన్ చేయగానే పోలీసులు స్పందించి ఉంటే ఇంతటి దారుణం జరిగేది కాదంటూ హేమంత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదంతా పోలీసులు నిర్లక్ష్యంగానే చెబుతున్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా వివరాలు సేకరిస్తున్నారు. డయల్ 100కు ఫోన్ రాగానే స్పందించకపోవటం వెనుక కారణాలను తెలుసుకుంటున్నారు. బాధ్యులను గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. పరవు హత్యలో ఎవరెవరు సాయం చేశారు. దీనికి ఎవరైనా పోలీసుల సహాయం చేశారా! అనే కోణంపై కూడా పోలీసులు దృష్టిసారించారు. మరో వైపు హేమంత్ మృతదేహం లభించిన చోట క్లూస్ టీమ్, పోలీసు జాగిలాలు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాయి.