నందిగామ‌పై మ‌ళ్లీ టీడీపీ జెండా ఎగిరేనా???

ప‌శ్చిమ కృష్ణాలో రాజ‌కీయంగా కీల‌క‌మైన నియోజ‌క‌వర్గం నందిగామ‌. మెట్ట ప్రాంతం కావ‌టంతో ప్ర‌జ‌లు కాయ‌క‌ష్టం, వ్య‌వ‌సాయం ఆధారంగా జీవ‌నం సాగిస్తుంటారు. సాగ‌ర్ నీళ్లు ఏ నాడో దూర‌మ‌య్యాయి. సుబాబులు, మెట్ట‌పంట‌ల‌తో కాలం వెళ్ల‌దీయాల్సిన దుస్థితి. ఇటువంటి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రం నందిగామ‌కు ద‌శాబ్దాల నుంచి రాజ‌కీయ చ‌రిత్ర ఉంది. చైత‌న్య‌వంతులైన ప్ర‌జ‌ల తీర్పు కూడా వైవిధ్యంగా ఉంటుంది. ముక్క‌పాటి, వ‌సంత‌నాగేశ్వ‌రావు, దేవినేని ర‌మ‌ణ వంటి నేత‌లు అక్క‌డ నుంచి గెలిచి మంత్రులుగా ఎదిగారు. ఒక‌ప్పుడు కాంగ్రెస్ కంచుకోట‌ను దేవినేని ర‌మ‌ణ రాక‌తో టీడీపీ కైవ‌సం చేసుకుంది. 1994 నుంచి 2014 వ‌ర‌కూ తెలుగుదేశం పార్టీయే అక్క‌డ చ‌క్రం తిప్పుతూ వ‌చ్చింది. 2019లో చానాళ్ల త‌రువాత వైసీపీ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ మొండితోక జ‌గ‌న్మోహ‌న్‌రావు ఎమ్మెల్యేగా టీడీపీ కోట‌ను బ‌ద్ద‌లు కొట్టారు. నందిగామ‌, చంద‌ర్ల‌పాడు, కంచిక‌చ‌ర్ల‌, వీరుల‌పాడు మండ‌లాల్లో ఒక్కో మండలంలో ఒక్కో కులం, పార్టీకు ప‌ట్టు ఉండ‌టం కూడా నేత‌ల‌కు కొన్నిసార్లు ఇబ్బందిగా మారుతోంది.

ప్ర‌స్తుతం నందిగామ న‌గర పంచాయ‌తీ ఎన్నిక‌లు వైసీపీ, టీడీపీల‌కు స‌వాల్‌గా మారాయి. 20 వార్డులున్న మున్సిప‌ల్ బ‌రిలో టీడీపీ ఆధిప‌త్యం నెగ్గించుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. వైసీపీ ఎలాగైనా అక్క‌డ జెండా ఎగుర‌వేసి స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతుంది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన తీర్పు ఇక్క‌డా వ‌స్తుంద‌నే గంపెడాశ‌లు పెట్టుకుంది. కానీ.. నందిగామ ప‌ట్ట‌ణంతోపాటు హ‌నుమంతుపాలెం, అనాసాగ‌రం శివారు గ్రామాలు కూడా ఇక్క‌డ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌నున్నాయి. క‌మ్మ‌, కాపు, బీసీ, ఎస్సీ, మైనార్టీలు ఒక్కో వార్డులో ప్ర‌భావం చూపుతారు. ఇటువంటి కీల‌క‌మైన చోట ప్ర‌స్తుతం వైసీపీ త‌ర‌పున మండ‌వ వ‌ర‌ల‌క్ష్మి, టీడీపీ త‌ర‌పున శాఖ‌మూరి స్వ‌ర్ణ‌ల‌త వంశీధ‌ర్ బ‌రిలో ఉన్నారు. ఇద్ద‌రూ క‌మ్మ సామాజిక‌వర్గం కావ‌టం.. ఇక్క‌డ విజ‌యం సాధించ‌టంలో క‌మ్మ ఓట్లు కీల‌కం కావ‌టంతో ఉత్కంఠ‌తగా మారింది. జ‌న‌సేన‌, బీజేపీ కూడా కొన్ని వార్డులో అభ్య‌ర్థుల‌ను నిలిపాయి. మైనార్టీ, కాపు, ఎస్సీ ఓట్లు త‌మ‌కు అనుకూలంగా ఉన్నాయ‌ని జ‌న‌సేన అంచ‌నా వేసుకుంటంది. మొన్న‌టి పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ కాపులు, ఎస్సీలు క‌ల‌యిక‌తో గ‌ట్టిగానే వైసీపీ, టీడీపీల‌కు ఎదురొడ్డి నిల‌బ‌డ్డారు. ఇప్పుడు నందిగామ మున్సిప‌ల్ బ‌రిలోనూ తాము క‌లిసే కొన్ని వార్డులు గెలుచుకుంటామ‌నే ధీమాతో ఉన్నారు.

2014లో టీడీపీ గెలిచాక‌.. గ‌తానికి భిన్నంగా దోపిడీకు ప‌రాకాష్ట‌గా నేత‌లు వ్య‌వ‌హ‌రించారు. క‌మీష‌న్ల యావ‌తో కొండ‌లు, ఇసుక రేవులు దండుకున్నారు. పేద‌వాడికి ఇచ్చే సంక్షేమ ప‌థ‌కాల్లోనూ క‌క్కుర్తి చూపారు. పేరుకే ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అని.. తెర వెనుక చ‌క్రం తిప్పేందుకు నాలుగు మండ‌లాల్లో న‌లుగురు నేత‌లు ఉండేవార‌నే విష‌యం గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీను ఘోరంగా దెబ్బ‌తీసింది. జ‌న్మ‌భూమి క‌మిటీల నుంచి నందిగామ పంచాయ‌తీ కాంట్రాక్టులు, చివ‌కు బ్లీచింగ్ పౌడ‌ర్ చ‌ల్లేందుకు క‌మీష‌న్లు తీసుకునే దుస్థితికి దిగజారార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. పైగా కాపు, ఎస్సీ వ‌ర్గాన్ని ఇబ్బందుల‌కు గురిచేశార‌నే విమ‌ర్శ‌లూ లేక‌పోలేదు. 2019లో అధికారం చేప‌ట్టి వైసీపీ కూడా టీడీపీ న‌డ‌చిన దారిలోనే కొండ‌లు, ఇసుక , కాంట్రాక్టుల్లో భారీగా అవినీతికి పాల్ప‌డిన‌ట్టుగా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

పేద‌ల‌కు పంచాల్సిన నివేశ‌న స్థ‌లాల్లోనూ అధికార పార్టీ నేత‌లు క‌మీష‌న్లు మెక్కార‌నే విష‌య సీఎంవో వర‌కూ చేరింది. దీనిపై నిఘావర్గాలు స‌మాచారం సేకరించాయి కూడా. అటువంటి చోట ఇప్పుడు జ‌ర‌గ‌బోయే మున్సిప‌ల్ ఎన్నిక‌లు రెండు పార్టీల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. అయితే కొత్త అభ్య‌ర్థిగా మండ‌వ వ‌ర‌ల‌క్ష్మి ఎంత వ‌ర‌కూ నెగ్గుతుంద‌నే భావ‌న వైసీపీలో ఉన్నా.. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ఎమ్మెల్యే డాక్ట‌ర్ జ‌గ‌న్మోహ‌న్‌రావు మంచిత‌నం త‌మ‌ను గ‌ట్టెక్కిస్తాయ‌ని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక‌పోతే టీడీపీ త‌ర‌పున బ‌రిలో ఉన్న ఛైర్మ‌న్ అభ్య‌ర్థిని శాఖ‌మూరి స్వర్ణ‌ల‌త ప‌ట్ల‌ ప్ర‌జ‌ల్లో సానుకూల అభిప్రాయం ఉంది. గ‌తంలో స‌ర్పంచ్‌గా తాను చేసిన అభివృద్ధి అంద‌రినీ క‌లుపుకుని పోవ‌టం వంటి అంశాలు అనుకూలిస్తాయ‌ని టీడీపీ ఆశ‌లు పెంచుతున్నాయి. అసెంబ్లీ సీటును కోల్పోయిన టీడీపీ ఎలాగైనా మున్సిపాలిటీను గెలుచుకోవ‌టం ద్వారా పోయిన ప‌ర‌వును రాబ‌ట్టుకోవాల‌ని చూస్తుంది… మ‌రి.. ఎవ‌రి అంచ‌నాలు ఫలిస్తాయో.. మ‌రెవ‌రి లెక్క‌లు త‌ప్పుతాయ‌నేది కాల‌మే నిర్ణ‌యించాలి.

Previous articleహిందుత్వ వ్య‌తిరేక‌త‌కు.. హిందుత్వ‌మే జ‌గ‌న్ ఆయుధం!
Next articleప‌వ‌న్ వెంట కాపులు.. మార‌నున్న రాజ‌కీయం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here