నెల్లూరు జిల్లా రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. నిన్నటి వరకూ టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేది. ప్రస్తుతం అక్కడ వైసీపీ నేతల మధ్య అంతర్గత యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకప్పుడు నెల్లూరు అంటే ఆనం బ్రదర్స్ అనేంతగా ఉండేది. ప్రస్తుతం అక్కడ ఆనం సోదరుల హవాకు సొంతవాళ్లే బ్రేకులు వేస్తున్నారట. ఆనం వివేకా మరణం తరువాత ఆనం రాంనారాయణరెడ్డి ఒంటరిగా మారాడు. టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిపదవిపై ఆశ పెట్టుకున్నా.. అనిల్‌కుమార్ యాదవ్‌కు ఇవ్వటంతో ఆయన సైలెంట్ అయ్యారు. ఒకప్పుడు కనుసైగలతో రాజకీయం నడిపిన ఆనం వారి మాట ఎవ్వరూ వినేలా లేరు.
ఆధిపత్య రాజకీయాలకు కేరాఫ్ చిరునామాగా నెల్లూరు మారింది. దశాబ్దాలపాటు మంత్రిగా ఏలిన ఆనం సోదరులకు ఇప్పుడు అక్కడ ఎదురుగాలి మొదలైంది. ఆయన వెంకటగిరికే పరిమితం కావటం కూడా అడ్డంకిగా మారిందట. కాటంరెడ్డి, అనిల్‌కుమార్ ఇద్దరూ గతంలో ఆనం కోటరీలో నే ఉండేవారు . క్రమంగా వారిపుడు వేరే కుంపటి పెట్టడంతో అనిల్‌కుమార్ యాదవ్ ఏకంగా మంత్రిగా ఎదిగారు. ఇప్పుడు ఆయన ఆనం ఆనవాళ్లులేకుండా ఉండాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఆనం రామనారాయణరెడ్డి ఘాటైన కామెంట్లు చేశారు. తమను నెల్లూరుతో ఎవరూ విడదీయలేరంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వివేకాన్న మరణించాక నెల్లూరు నగరాన్ని ఆనం కుటుంబం వదిలేసిందనే ఆరోపణలు వచ్చాయి. నెల్లూరు నగరాన్ని భవిష్యత రాజకీయాల్లో తాము వదలమంటూ రాం నారాయణరెడ్డి అన్నారు. మంత్రి అనిల్ కూడా స్పందించాడు. నెల్లూరు తన జాగీర్ కాదన్నారు. సీఎం జగన్ కు నష్టం జరిగేలా చూస్తే తాను కలగజేసుకుంటానంటూ నర్మగర్బంగా మాట్లాడారు. ఇదేమీ నా జాగీరు కాదన్నారు.
ఆనం వివేకా జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. కేవలం గంట వ్యవధిలోనే తీసివేయటంపై వివేకా తనయుడు రంగమయూర్‌రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మున్సిపాలిటీ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. క్రికెట్ బెట్టింగ్‌లు చేసేవారి ప్లెక్సీల్లో వారాల కొద్దీ వేస్తున్నారంటూ బండబూతులు తిట్టిపోశారు. వైసీపీ సొంతగూటిలో కీలకమైన జిల్లాలో ఎదురవుతున్న అంతర్గత కలహాలు మున్ముందు పార్టీకు ఎటువంటి చెడు తీసుకువస్తాయనేది వైసీపీ సీనియర్ల ఆందోళనట.