శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చినట్టుగా ఉందట ఏపీలో రాజకీయ పార్టీలు, సర్కారు పరిస్థితి . పదేళ్లపాటు పాదయాత్ర చేసిన జగన్ మోహన్‌రెడ్డి కష్టాన్ని సొంతవాళ్లే దెబ్బతీస్తున్నారట. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఎప్పుడు గద్దెనెక్కినా ఉంటే రెడ్డి.. గాకపోతే కమ్మ.. అడపదడపా కాపు, బీసీలకు పెత్తనం చేసే అవకాశం చిక్కేది. 1995 తరువాత పూర్తిగా పరిస్థితి మారిపోయింది. టీడీపీ అధికారంలో ఉంటే కమ్మ వర్గానికే కిరీటాలు. కాంగ్రెస్ వచ్చాక రెడ్డి వర్గానిదే పెత్తనం అనేంతగా సాగింది. 2014 ఎన్నికలతో అది పూర్తిగా ఏకపక్షంగా మారింది. టీడీపీ అంటే కేవలం కమ్మసామాజికవర్గానిదే అనే భావన బలంగా నాటుకుపోయింది. ఇతర కులాలను తక్కువ చేయటం.. అవకాశాలు కల్పించకపోవటం.. సమర్థులైన అధికారులకు పోస్టింగ్‌ల విషయంలోనూ ఇదే వైఖరి అవలంభించారు. కులంకార్డు తప్ప.. ప్రతిభ ఏ మాత్రం కొలమానం కాదనే భావన రేకెత్తించారు.
2019 నాటికి అదే కులం కార్డు టీడీపీ కొంపముంచింది. బీసీలు, కాపులు, ఎస్సీలు తెలుగుదేశం పార్టీకు వ్యతిరేకంగా మారారు. పచ్చిగా చెప్పాలంటే కమ్మ వర్సెస్ నాన్ కమ్మ అన్నట్టుగా నాటి ఎన్నికల్లో టీడీపీను మట్టికరిపించారు. ఎన్నికలకు ముందు వైసీపీ అదినేత జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో సుమారు 60 మందికి పైగా అధికారులు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారంటూ పేర్కొన్నారు. కమ్మ వర్గానికి చెందిన వీరంతా టీడీపీకు అనుకూలంగా పనిచేస్తారంటూ వారిని బదిలీ చేయాలంటూ వివరించారు. ముఖ్యంగా పోలీసు శాఖలో డీఎస్పీ నుంచి ఎస్పీ వరకూ ఏ కులం అనేది కూడా ప్రస్తావించారు. ఇది గతం.. టీడీపీలోని ఆ కులాభిమానం ఇతర కులాలను దూరం చేసి ప్రతిపక్షంలోకి నెట్టేసింది.
2019 నాడు కులం.. కులం అంటూ.. వ్యతిరేకత వెలిబుచ్చిన జగన్ మోహన్‌రెడ్డి సర్కారులోనూ కులం కార్డుకే ప్రాధాన్యత పెరిగిందంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. చాంతాడంత జాబితాలో అంటే.. యూనివర్సిటీ నుంచి నామినేటెడ్ పోస్టుల వరకూ 90 శాతం రెడ్డివర్గానికి చెందిన నాయకులకే ప్రాధాన్యతనిచ్చారంటూ సాక్షాలతో సహా చూపారు. సీఎం అపాయింట్‌మెంట్ కావాలన్నా..కూడా కుదర్లేదంటూ వాపోయారు. ఆ నాడు రఘురామ కృష్ణంరాజు అన్నమాటలే.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నోటి నుంచి రావటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆమె మాట్లాడినట్టుగా చెబుతున్న ఒక సెల్‌పోన్ సంభాషణ ఆడియో బయటకు వచ్చింది. వైసీపీలో రెడ్డి వర్గానికి ఎంతటి ప్రాముఖ్యతనిస్తారనే దానిపై తన అభిప్రాయం పంచుకున్నారు. ఎమ్మెల్యేగా తనకు ఎదురైన అనుభవాలను వివరించారు ఎస్సీలు, బీసీలను నెత్తిన పెట్టుకున్నట్టుగా చెప్పే పార్టీల అసలు స్వరూపం వేరేలా ఉంటుందంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఈ రెండు వర్గాలు ఏకమైతే బావుంటుందనే సలహా కూడా ఇచ్చారు. దశాబ్దాలుగా పాతుకుపోయిన కులాభిమానం.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే.. అదే కులానికి ప్రాముఖ్యతనివ్వటం వంటివి కొనసాగుతూనే ఉన్నాయి. ఏడేళ్లుగా మరీ మితిమీరిన క్యాస్టిజం.. సినీ రంగంలో నెపోటిజాన్ని మించేలా.. ఇతర కులాల నుంచి వ్యతిరేకతను చవిచూస్తోంది. కొత్త రాజకీయ సమీకరణలకు.. రాజకీయపార్టీలే ఆజ్యం పోస్తున్నాయనిపిస్తుంది. ఈ పరిస్థితి మున్ముందు ఇంకెంతటి ఇబ్బందులకు దారితీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.