ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అంతా జగన్నామస్మరణగా మారింది. విశాఖపట్టణం, గుంటూరు, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కడప ఇలా.. ప్రతి ప్రధాన నగరాలు/పట్టణాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలపై చాలా ప్రజావ్యతిరేకత ఉంది. కానీ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు. ముఖ్యంగా నవరత్నాలు గురించి ప్రజలు పాజిటివ్‌గా ఉన్నారు. లోకల్ నేతల తప్పులు.. అక్రమాలు కళ్లెదుట కనిపిస్తున్నా జగన్ వాటిని కట్టడి చేస్తాడనే నమ్మకం కూడా ప్రజల్లో కనిపిస్తోందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ దఫా చాలా మున్సిపాలిటీల్లో కొత్త వారికి అవకాశం కల్పించారు. స్థానికంగా పట్టులేకపోయినా కేవలం పార్టీ ను చూసి ఓట్లేస్తారనే భరోసానే దీనికి కారణంగా తెలుస్తోంది. పల్లెల్లో తమకు వచ్చిన మద్దతు.. విపక్షాల కు తగిలిన ఎదురుదెబ్బలు.. మున్సిపల్ ఎన్నికల్లోనూ తప్పవని ధైర్యంగా ఉన్నారు. ఏపీలో మార్చి 10న 12 కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. వాస్తవానికి గతేడాది మార్చిలోనే ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కొవిడ్ కారణంలో ఎన్నికల సంఘం వీటిని వాయిదా వేసింది . దీనిపై నిమ్మగడ్డ వర్సెస్ వైసీపీ అన్నంతంగా రచ్చ జరిగింది. కోర్టుల జోక్యంతో చివరకు పురపోరు మొదలైంది. అయితే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బాగానే లాభపడినట్టు చెబుతున్నా ఓట్ల శాతం అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే తగ్గినట్టుగానే గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు పట్టణ, నగర ఓటర్లు ఎలా స్పందిస్తారనేది అంచనా వేయలేకపోతున్నారు. ఎవరికివారే మేకపోతు గాంబీర్య ప్రదర్శిస్తున్నా లోలోన భయం మాత్రం వెంటాడుతోంది. టీడీపీ బలహీనత, కేడర్ వైఫల్యం, చంద్రబాబు నాయకత్వ లోపం ఇవన్నీ తమకు కలసి వస్తాయనేది వైసీపీ ధీమా.
ఇక్కడే అసలు తంతు మొదలైంది. రాజధాని చర్చ, మూడు రాజధానులు గొడవ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తరలింపు, దేవాలయాల పైదాడులు, కులపరమైన పంచాయితీలు వైసీపీ నేతలకు చికాకు పుట్టిస్తున్నాయి. కానీ.. అందరిలో జగన్ పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం ఈ దఫా గండం గట్టెక్కిస్తుందనే ధీమామాత్రం చెక్కుచెదరకుండా ఉంది. కొడాలి నాని, నందిగం సురేష్, తాడికొండ శ్రీదేవి, వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి, పేర్ని నాని వంటి నేతలపై ప్రజల్లో అసహనం. నెల్లూరు జిల్లాల్లో అంతర్గత పోరు. గుంటూరులో రాజధాని తరలింపు ప్రభావం, విశాఖలో ఉక్కు, విజయవాడలో కులప్రభావం ఇవన్నీ వైసీపీను ఇరుకున పెడుతున్నట్టుగా టీడీపీ లెక్కలు కడుతున్నా.. వైసీపీ మాత్రం అధినేత జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల వ్యూహం. ప్రజల్లో ఆయన ఇమేజ్ పట్టణ ప్రజలూ
తమ వైపే అనేందుకు నిదర్శనం అంటున్నారు. ఏమైనా.. లోకల్ లీడర్లు ఎలా ఉన్నా.. అధినేత వైఎస్ .జగన్ మోహన్‌రెడ్డి మాట తప్పని నైజం.. మడమతిప్పని తీరు తమకు మరో పదేళ్లపాటు అధికారాన్ని దగ్గర చేస్తుందనే ఆత్మవిశ్వాసం వారిలో కనిపిస్తోంది.