జనసేనాని దూకుడు పెంచారు. రాజకీయాల్లో రాణించాలంటే రాజకీయమే చేయాలని నిర్ణయించుకున్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నామనే ప్రతినకు విఘాతం తలెత్తకుండా వైరి వర్గాలకు తన మాటలతోనే ముచ్చెమటలు పోయిస్తున్నారు. తనకు వైసీపీ అన్నా.. జగన్ అన్నా వ్యక్తిగత ద్వేషం లేదని.. కేవలం విధానపరమైన అంశాలను మాత్రమే తాను విమర్శిస్తానంటూ తేల్చిచెప్పారు. మొన్న గుడివాడలో చేసిన పేకాట క్లబ్బుల గర్జనతో వైసీపీ శ్రేణులు ఉలికిపాటుకు గురయ్యాయి. మొదట్లో పవన్‌ను తూలనాడిన మంత్రి కొడాలి నాని కూడా తన ఇలాఖాలోనే జరుగుతున్న పేకాట క్లబ్బులపై పోలీసులు దాడులు చేయటంతో సైలెంట్ అయ్యారు. పవన్ నుంచి ఫోకస్ ఇప్పుడు మంత్రి దేవినేని పై ఉంచినట్టుగా కనిపిస్తోంది. ఇటువంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ గురువారం తిరుపతి లో పర్యటించనున్నారు. రెండు మూడు నెలల్లో జరగబోయే తిరుపతి పార్లమెంటరీ స్థానికి ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ ఫుల్ ఫోకస్ ఉంచాయి. బీజేపీ కూడా తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో తిరుపతి ఉప ఎన్నికను లక్ష్యం చేసుకుంది. అయితే.. అక్కడ జనసేనకు బలమైన కేడర్ ఉండటం.. బలిజలు, యాదవ వర్గాలు పవన్‌కు అనుకూలంగా ఉండటం.. జనసేనకు లాభిస్తాయనేది సేనాని అంచనా. అయితే బీజేపీ మాత్రం తమ పట్టువీడేలా కనిపించట్లేదు. ఇటీవలే సోము వీర్రాజు బీజేపీ తిరుపతి బరిలో ఉంటుందని చెప్పటం జనసైనికుల్లో కోపానికి కారణమైంది. రెండు పార్టీల మధ్య మైత్రి ఉన్న నేపథ్యంలో ఇద్దరు నేతల నిర్ణయమే ఫైనల్ కానుంది. అయితే సేనాని పర్యటనతో మరోసారి ఉప ఎన్నికలపై ఎలాంటి ప్రకటన చేస్తారనేది ఉత్కంఠతగా మారింది. ఒకవేళ పవన్ తమ పార్థీ పోటీలో ఉంటుందని ప్రకటిస్తే బీజేపీ స్పందన ఎలా ఉంటుందనేది మరో సస్పెన్స్. ఇది వైసీపీకు లాభిస్తుందనే అంచనాలు లేకపోలేదు. అయితే.. ఏపీలోని ప్రధాన పార్టీలకు తిరుపతి ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అన్ని పార్టీలు వెంకన్న సన్నిధిలో నెగ్గాలని భావిస్తున్నాయి.