మమత ను కాలి విరిచి కుర్చీలో కూర్చోబెట్టాడు.. జగన్‌పై కోడికత్తి దాడితో పాపులారిటీ తెచ్చిపెట్టాడు. చంద్రబాబు రాయి డ్రామా వెనుక కూడా ఎత్తుగడ ఉందేమో.. ఇప్పుడు తెలంగాణలో షర్మిల దీక్ష.. ఆ తరువాత పాదయాత్రలో పోలీసుల అడ్డుకట్ట. తోపులాటలో చిరిగిన షర్మిల వస్త్రం. ఇంత సానుభూతి.. అంతకు మించిన ప్రచారం.. ఎన్ని లక్షలు పోస్తే వస్తుంది. పాపం.. ఆడపిల్లను ఇలా చేస్తారా! అనే బాధ ఎన్ని కోట్లు కుమ్మరిస్తే దొరుకుతుంది. కానీ ఒకే ఒక్క దీక్షతో షర్మిలకు బోలెడంత పాపులారిటీ. ఇప్పటి వరకూ తెలంగాణలో ఏ పార్టీ కూడా చేయలేని సాహసం. ఏ నేత కూడా ధైర్యం చేయలేని పని షర్మిల చేసింది. తెలంగాణ గడ్డమీద ఆంధ్ర రాజకీయాలు.. సీమ పాలిట్రిక్స్‌ను వడబోసి.. దడపుట్టించింది. ఇంతకీ.. షర్మిల వెనుక ఎవరున్నారు. అసలు ఆమె ఎందుకు పార్టీ పెడతానంటుంది. టీవీ ఛానల్, పేపర్ పెట్టేంత డబ్బుందా.. లేకపోతే.. జగన్ ప్రత్యర్థి వర్గానికి చెందిన ఎవరైనా మీడియా నుంచి ప్రచారం కల్పిస్తామని హామీనిచ్చారు. శత్రువు శత్రువు మిత్రుడు గా భావించిన షర్మిల సదరు అజ్ఞాతవ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుందా.. దీనంతటి వెనుక ప్రశాంత్ కిషోర్ మంత్రాంగం నడుస్తుందా! ఇవన్నీ తెలంగాణలో షర్మిల చుట్టూ పెల్లుబుకే ప్రశ్నలు. లోటస్‌పాండ్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన జగన్ ఏపీ సీఎం అయ్యాడు. జులై 8 నుంచి తెలంగాణలోనూ పాదయాత్ర చేసే జగన్ అన్న బాణం.. షర్మిల కూడా ఇదే రాష్ట్ర సీఎం కావటం ఖాయమేనా! అనేది ఇప్పుడు తెలుగు నాట చర్చనీయాంశంగా మారిందన్నమాట.
వైఎస్ షర్మిల పరిచయం అవసరం లేదు. కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రినంటూ తెగేసి చెబుతున్నారు. ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా తనను సీఎం కావటం ఆపబోరంటున్నారు.నిజమే ఆమెలో ఆ నాయకత్వం ఉంది. అంతకు మించి వైఎస్ అనే గొప్ప నేత కూతురుగా గుర్తింపు ఉంది. అంతమాత్రాన షర్మిల సీఎం అవుతుందా అనే అనుమానాలు రావటం సహజమే. మరి దానికి తగినట్టుగా మందీ మార్బలం ఎలాగూ వస్తారు. బ్రదర్ అనిల్ క్రైస్తవ బోధకుడుగా దండిగానే కూడబెట్టారు. రెడ్డి వర్గం అండ దండలు వస్తాయి. ఇప్పటకే కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతతో చాలామంది రెడ్డి వర్గ నేతలు బయటకు వచ్చే అవకాశాలు న్నాయనే గుసగుసలున్నాయి. ఇవన్నీ పక్కనబెడితే ఎవరో పెద్ద తల.. అంతకు మించి రాజకీయాలు నేర్చిన రాజకీయ గురువులు లేకపోతే ఇంత పక్కా ప్లానింగ్‌తో పార్టీ పెట్టేముందు హీట్ పుట్టించటం సాధారణం కాదు. ఇదంతా జగన్‌కు తెలిసి జరుగుతుందా! లేదా! అనే దానిపై ఊహాగానాలున్నాయి. కానీ షర్మిల ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగదీక్ష నుంచి లోటస్‌పాండ్‌లో మూడ్రోజుల దీక్ష వరకూ జరిగిన హైడ్రామా అంతా ఒక ఎత్తు. ఇదంతా పక్కా వ్యూహం ప్రకారం జరిగినదేనంటున్నారు రాజకీయ పండితులు. సాక్షి మీడియా తనకు కవరేజ్ ఇవ్వదంటూ సున్నితంగా కాదు.. గట్టిగానే సాక్షి ప్రతినిధులకు షర్మిల వార్నింగ్ ఇచ్చారు. పక్కనే ఉన్న తల్లి విజయమ్మ కూతుర్ని సర్దిచెప్పే ప్రయత్నం చేయటం కొసమెరుపు. ఏమైనా.. తెలుగు రాష్ట్ర రాజకీయ వేదికపై కొత్త డ్రామా ఎంత వరకూ రక్తికడుతుందో.. ఇంకెంతగా పండిస్తుందో !!!



