ఎంత విజ్ఞానం పెరిగినా.. ఎంత పెద్ద చదువులు చదివినా మూఢనమ్మకాలు జనాన్ని వీడట్లేదు. మొన్నీ మధ్య చిత్తూరులో ఓ ప్రొఫెసర్ తన కూతుళ్లిద్దరినీ బలివ్వటం కలకలం రేపింది. ఇటీవలే చెన్నైలో నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించిన తండ్రి నుంచి తప్పించుకున్న ఇద్దరు చిన్నారులు పో్లీసుల సంరక్షణకు చేరారు. ఇప్పుడు విశాఖపట్టణంలో నలుగురు ఒక ఇంట్లో దహనం కావటం వెనుక క్షుద్రపూజలు జరిగాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మధురవాడ మిథిలాపుర కాలనీకు చెందిన ఎన్ ఆర్ర ఐ కుటుంబం ఆదిత్య టవర్స్ ఐదవ అంతస్థులో ఉంటుంది. బుధవారం అర్థరాత్రి దాటాక ఆ కుటుంబం ఉండే ఫ్లాట్ లో మంటలు వచ్చాయి. మృతులు బంగారు నాయుడు , డాక్టర్ నిర్మల, కుమారులు దీపక్ కశ్యప్ గా గుర్తించారు. దీపక్ కొద్దికాలంగా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడట. కొద్దిరోజుల క్రితమే ఇక్కడకు వచ్చారట. ఇంతలో ఏమైందో ఏమో ఒకే ఇంట్లో దారుణంగా మరణించారు. అయితే దీని వెనుక ఆస్తితగాదాలు , పాత కక్షలు ఏమైనా ఉన్నాయా! అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.