పోలీస్… ఖాకీ డ్రస్‌లో కరకుదనం మాత్రమే కనిపిస్తుంది. దానివెనుక దాగిన వెన్నంటి మనసు కొందరికే తెలుస్తుంది. వానొచ్చినా.. వరదొచ్చినా.. విందులు.. వినోదాలు. పండుగలు.. పబ్బాలు.. పుట్టినరోజు వేడుకలు.. పెళ్లిరోజు కానుకలు ఇవన్నీ మరచి.. అలసినా పరుగులు పెడుతూ అలుపెరగని సైనికుడు పోలీసు. సరిహద్దున సిపాయి కాపలా దేశాన్ని గుండెల మీద చేయివేసుకునేలా చేస్తే.. పోలీసన్నల పహారా.. మాకేం కాదనే ధైర్యంతో నిద్రలోకి జారుకునేందుకు బాసటగా మారుతోంది. అంతటా వరదలు. ఎంతమంది గల్లంతయ్యారనేది ఎవరికీ తెలియదు. రోడ్లన్నీ వరదనీటితో నిండాయి. కాల్వలు, నాలాలు అన్నీ ఏకమయ్యాయి. కార్లు కొట్టుకుపోయాయి. ఏ ఇంట్లో ఎవరు కనిపించకపోయినా చెరువుల వద్దకు పరుగులు తీస్తున్నారు. వర్షం కురుస్తుందనే హెచ్చరికతో నగరం ఇంటికే పరిమితమైంది. ఒక్కరు తప్ప.. ఆ ఒక్కరే పోలీస్.
నిజమే.. పిల్లోడుకు జ్వరంగా ఉందంటూ భార్య పిలిచినా.. ఆ భర్త నువ్వె తీసుకెళ్లు.. నాకు డ్యూటీ ఉంది.. వరదనీటిలో చిక్కిన బస్తీ జనాన్ని తరలించాలంటూ .. ఇంటిని వదిలేసి గల్లీ వైపు పరుగులు తీశాడు. బిడ్డా . మొన్ననే కరోనా వైరస్ వచ్చి తగ్గింది. నాల్రోజులు రెస్ట్ తీసుకోవచ్చుగా అంటూ కన్నతల్లి మాటలు వింటూ.. కన్నీరు కనిపించకుండా విధుల్లోకి వెళ్లిన సాహసి పోలీస్.
నిజమే సుమా.. హైదరాబాద్ మహానగరంలో పోలీసు కొలువంటే మాటలు కాదు. ఉగ్రమూకలు.. అసాంఘికశక్తులు.. గుట్కాడాన్‌లు.. డ్రగ్స్ స్మగ్లర్లు.. సైబర్ నేరగాళ్లు.. వైట్ కాలర్ కంత్రీగాళ్లు.. ఏ రోజు కారోజు కొత్త సవాళ్లు. కత్తిమీద సాము కూడా ఇంత కఠినంగా ఉండదేమో అనిపిస్తుంది.రౌడీషీటర్లు.. ఖద్దరు నేతల బెదిరింపులు.. ఇవన్నీ భరిస్తూ.. సహనంతో నవ్వుతూడ్యూటీ చేస్తూ.. ఫ్రెండ్లీ పోలీస్‌గా మెలగాలి. అదే క్రిమినల్స్‌ను దారిలోకి తెచ్చేందకు కఠవుగా మారాలి. ఇన్నిరూపాలు.. ఒకే ఒక్క పోలీస్ మాత్రమే చేయగలడు.
ఇవన్నీ ఎందుకు గుర్తొచ్చాయంటారా.. ఇక్కడ ఫొటో చూడండీ.. సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యం. జేసీబీ సాయంతో వరదనీటి ఉదృతిలో కొట్టుకు వచ్చిన మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఓ పోలీసున్న చేస్తున్న ఫీట్. వంతెన మీద నుంచి కిందకు చూస్తేనే కళ్లు తిరిగే పరిస్థితుల్లో ఖాకీ బట్టలు వేసుకున్న పోలీస్‌మాత్రమే ఇలా ఉండగలడనేలా నిరూపించాడీ పోలీసన్న.
నిర్జీవంగా పడివున్న ఆ దేహంలో ఏదోమూలన ప్రాణం ఉందని పరిశీలించాడు. ప్రాణం పోయిందని తెలిసిన పోలీసున్న మనసు ఎంతవిలవిల్లాడి ఉంటుందో.. అర్రె ముందుగా తెలిసుంటే కాపాడేవాళ్లమని ఎన్నిసార్లు అనుకుని ఉంటాడో.. కనీసం ఆ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేయాలని ఎంతగా పరితపించి ఉంటాడో కదా! అందుకే.. పోలీసు అనగానే చిన్నచూపు వదిలేయండీ.. ఏ ఒక్కరో.. తప్పు చేశారని అందర్నీ ఒకేగాటిన కట్టేయటం మానండీ.. పోలీసున్న.. మన రక్షణ బాధ్యతలు చేపట్టే ఇంటి పెద్దన్నయ్యగా మనసులో గుర్తుంచుకోండి.