పొలిటికల్ గేమ్.. ఐపీఎల్ 2020 మించి మజా ఉంటుంది. ఎప్పుడు ఎవరు బౌన్సర్లు సంధిస్తారో.. ఎవరెలా సిక్సర్‌లతో విజృంభిస్తారనేది అంచనా వేయలేం. ఏపీ లో పోలవరం చుట్టూ నాటకీయ పరిణామాలకు మీరంటే మీరే కారణమంటూ ప్రధాన రాజకీయపక్షాలన్నీ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. తోలుబొమ్మలాటలో కేతిగాడిని మించిన నటనతో ఔరా అనిపిస్తున్నారు. ఈ విషయంలో ఏపీలోని 5 కోట్ల మంది ప్రజలు ప్రేక్షకులు మాత్రమే. ఎందుకంటే.. పోలవరం ప్రాజెక్టు ఆగిపోయేందుకు .. ఇన్నేళ్లు పూర్తిచేయకపోవటానికి నిందులు వేసుకుంటూ.. మరీ కోపం పెరిగినపుడు పచ్చిబూతులతో తిట్టుకుంటూ మాంచి సినిమా చూపిస్తున్నారు. నిజానికి పోలవరం ఏపీకు మాత్రమే జీవనాడి కాదు.. చత్తీస్‌ఘడ్, ఒడిషాలకు కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. అందుకే దీన్ని జాతీయ ప్రాజెక్టుగా మలచాలనే ప్రతిపాదన ఏ నాటి నుంచో ఉంది. 2005లో సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టుపై ఎన్నో ఏళ్ల తరువాత శంకుస్థాపన టెంకాయ కొట్టారు. జలయజ్ఞంలో భాగంగా దీన్ని కూడా మార్చారు. అప్పుడు కూడా ఇదే తంటా.. నిధులు, కోర్టు కేసులు, పునరావాసం చాలా అడ్డంకులు. ప్రతికూల మీడియాలో పిచ్చిరాతలు. నిజమే.. వాటిలో కొన్ని నిజాలు ఉండవచ్చు. వేల కోట్ల ప్రాజెక్టు ఏ కాంట్రాక్టు సంస్థ చేపట్టినా సబ్ కాంట్రాక్టులు, అమ్యామ్యాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ.. కేవలం వైఎస్ సీఎం అయ్యాక మాత్రమే ఇవన్నీ కొత్తగా పుట్టుకొచ్చాయంటూ గీరాలు పోతూ ప్రాజెక్టును మడతపెట్టేంత వరకూ నిద్రపోలేకపోయారు.
2014లో బాబు సీఎం కాగానే.. ఆంధ్రజాతిని ఉద్దరించేందుకు పుట్టిన మరో అభినవ పొట్టి శ్రీరాములు అవతరించాడనేంతగా పొర్లు దండాలు పెట్టారు. ఇంకేముంది.. ఆల్రెడీ బీజేపీతో పొత్తు.. ఎన్ డీఏలో చంద్రబాబు ఎంత చెబితే అంత. ఏపీకు ఇన్ని వేల కోట్లు కావాలంటే.. ఒక్క మాట కూడా ఎందుకు అని అడగకుండా.. చేతికిచ్చి పంపుతారనే ధీమా. ఎంతైనా చంద్రబాబు అంటే నరేంద్రమోదీకు అపారమైనభక్తి, సీనియర్ అనే గౌరవం.. అన్నీ ఉంటాయనే ఎన్నో ఊసులు.. బాసలు. కానీ చంద్రబాబు గురించి తెలిసిన నరేంద్రమోదీ ఎవర్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాననేంతగా చూపారు. అంతే బాబుకు కోపం వచ్చింది. పోవోయ్.. మోదీ. నువ్వు కాదంటే.. పోలవరం ఆపుతానా.. నా సొంత ఖజానా నుంచి తీసి మరీ మూడేళ్లలో పూర్తిచేస్తానంటూ మంగమ్మ శపథం మించిన ప్రతిన బూనారు. దీనికి ఆ నాటి అనుకూల మీడియా కూడా.. పోలవరం పూర్తిచేయాలంటే.. 20వేల కోట్లు చాలవు. రూ.35వేల కోట్లు కావాల్సిందేనంటూ ప్రధానపత్రికలో టాప్ హెడ్డింగ్‌తో మరీ చెప్పింది.
2019 బాబు కుర్చీ దిగారు. జగన్ అదే కుర్చీలో కూర్చున్నారు. మళ్లీ పోలవరం పూర్తిచేయాలని జగన్ భీష్మ ప్రతిన బూనారు. ఇంకేముంది.. పాదయాత్రలతో సీఎం అయిన మన జగన్.. ఆఫ్ట్రాల్ పోలవరం పూర్తిచేయలేడా అనుకున్నారు జనం. కానీ.. నిధులన్నీ నవరత్నాలు, ఉచిత పథకాలకే పోయాయి.. అక్షరాలా 65 వేల కోట్లరూపాయలు కేవలం ఉచితాలకు దారపోశారు. పోలవరం పూర్తికావాలంటే 50వేల కోట్లు కావాలనే సోయలోకి వచ్చారు. ఆ నాడు.. పాదయాత్రలో జగన్ పోలవరం కేవలం 20వేల కోట్లతో నిర్మించవచ్చంటూ చెప్పిన మాటలు ఇప్పుడు మోకాళ్లకు అడ్డంకిగా మారాయి. అయినా.. ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చాక అన్నీ వదిలేయాలనేట్టుగా.. అదంతా తూచ్.. పోలవరం రాష్ట్రం పూర్తిచేయాలంటే మీరు మరో 30 వేల కోట్లు ఇవ్వాలా! కాదంటే.. జాతీయ ప్రాజెక్టు కాబట్టి.. మీరే పూర్తిచేయాలంటూ ఇప్పుడు వైసీపీ సర్కారు అడ్డం తిరిగింది. మరి రాష్ట్రమే పూర్తిచేస్తానంటూ చెప్పిన మాటలు గుర్తు చేస్తే.. ఆ మాట అన్నది చంద్రబాబు అంటూ తప్పించుకునే ధోరణి. పోన్లే.. మన ఏపీకే కదా లాభమంటూ బీజేపీ ఏమైనా నిధులిస్తుందా అంటే.. అక్కడ కూడా ఎదురుదాడే. మా చేతుల్లో ఏం లేదు. నిన్నొక మాట.. రేపొక మాట చెప్పటానికి మేం.. జగన్, చంద్రబాబులం కాదు.. అంటూ ఎన్ డీఏ కూడా తూచ్ కొట్టేశారు. జీవనాడిని కాస్త ఊపిరి ఆడని విధంగా మార్చారు. ఎవరికి వారే.. లాభం పొందాలని ఆడుతున్న రాజకీయాల్లో పావుగా మారిన పోలవరం మళ్లీ పునరుజ్జీవం పొందాలంటే ఏదో అద్భుతం జరగాల్సిందే.