ఆమె మాటలు మంటలు పుట్టిస్తాయి.. కౌంటర్ ఇస్తే. అవతలి వారు చిత్తవ్వాల్సిందే. ప్రతిపక్షాలకు చుక్కలు చూపుతారు. స్వపక్షంలోనూ కొన్నిసార్లు మంటలు పుట్టించనూ గల సమర్థురాలు. అందుకే అందరూ ఫైర్‌బ్రాండ్.. కాదు కాదు. ఫైర్‌బ్రాండ్ పదానికి అంబాసిడర్‌గా గుర్తింపు పొందారు. ఆత్మాభిమానం.. వ్యక్తిత్వంతో గుర్తింపు తెచ్చుకున్న రేణుకాచౌదరి మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. రాష్ట్ర.. జాతీయ రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆమె కాంగ్రెస్‌కు వీరవిధేయురాలుగా ముద్ర ఉండనే ఉంది. ఖమ్మంజిల్లాలో ఆమె లేకుండా రాజకీయాలే నడపలేరనేంతగా తనదైన వర్గం ఉండనే ఉంటుంది. ఆరుపదుల దాటిన వయసులో ఆమెకు.. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠం అధిరోహించాలనే కోరిక మాత్రం అలాగే ఉందట. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. మొన్నీ మధ్య కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. అధ్యక్ష ఎంపిక తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీనికి అజాద్ వంటి సీనియర్లు రాసిన లేఖలే కారణమనేది జగమెరిగిన సత్యం. ఇక్కడే రేణుకాచౌదరి పేరు బయటకు వచ్చిందన్నమాట. సీనియర్ల తీరును ఎండగడుతూ.. గాంధీలు ఇక వద్దంటూ రాసిన లేఖలో రేణుకమ్మ సంతకం కూడా ఉండటమే అసలు కారణం. సోనియాగాంధీకు సన్నిహితంగా ఉండే రేణుకాచౌదరి ఇలా చేయటానికి కారణం లేకపోలేదట.
అదే.. రాహుల్‌గాంధీ. 2004,09లో ఎంపీ అయినా రేణుక.. తరువాత 2014లో ఓడినా రాజ్యసభ సీటు సంపాదించుకోగలిగారు. 2018 తెలంగాణ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు బద్ద వ్యతిరేకిగా ముద్రపడిన తెలుగుదేశం పార్టీతో పొత్తును ఆమె బహిరంగంగానే వ్యతిరేకించారు. అది భస్మాసుర హస్తమంటూ ఆనాడే ఆమె హెచ్చరించినా.. రాహుల్‌గాంధీ మేధావితనం వల్ల రేణుకాచౌదరి మాట వినలేదట. పైగా ఇప్పుడు తనకు పీసీసీ పీఠం దక్కకుండా రాహులే అడ్డుకుంటున్నాడనే కోపం కూడా ఏదోమూలన ఉందనే గుసగుసలూ లేకపోలేదు. ఏదైనా సోనియమ్మకు వ్యతిరేకంగా ఇలా సంతకం చేయటంపై హస్తం శ్రేణులు మండిపడుతున్నాయట. ఏమైనా.. రేణుకమ్మను దారికి తీసుకురావాలంటే.. పీసీసీ అధ్యక్షురాలిగా చేయటమో… రాజ్యసభ సభ్యత్వమో కల్పించటమే ప్రత్యామ్నాయమంటూ కొందరు సీనియర్లు ఎద్దేవాచేస్తున్నారట కూడా. ఏమైనా.. ఫైర్‌బ్రాండ్ ఫైర్‌బ్రాండే అనిపించారంటూ అభిమానులు మాత్రం తెగ ఖుషీ అవుతున్నారట.