వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. రచ్చబండతో ఏపీ ప్రభుత్వానికి పెద్ద గుదిబండగా మారాడు. ఆయన మాటల ధాటికి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమనాలో తెలియక.. అనాలో లేదో అర్ధమవక.. పవన్‌పై నోరుజారినంత ఈజీగా రఘురాముడిపై విమర్శలకు దిగలేకపోతున్నారు. ఇదంతా ఎందుకంటే.. ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. దీనిపై సీబీఐ కోర్టు విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. అసలు విచారణ ఉండదు. రఘురాముడిపై ఆగ్రహం వ్యక్తంచేస్తుందని ఊహించుకున్న వైసీపీ నేతలకు ఇది షాక్‌గానే మిగిలింది. అక్రమాస్తుల కేసులో జగన్ పై 11 ఛార్జిషీట్లు నమోదయ్యాయి. 2014లో జగన్ బెయిల్ నుంచి విడుదలయ్యారు. ఏడేళ్లపాటు బెయిల్‌పైనే ఉన్నారు. ఇప్పుడు ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే అభియోగాలతో రఘురాముడు కోర్టును ఆశ్రయించారు. ఇదే ఎవరైనా విపక్ష నేతలైతే.. వైసీపీ తమ బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసేదేమో.. కానీ. సొంత పార్టీ గుర్తుతో గెలిచిన రఘురామకృష్ణంరాజు అదే పార్టీ అధినేత బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టు మెట్లెక్కటం సవాల్‌గా మారింది. మరి దీనిపై పార్టీ పరంగా ఎలా స్పందిస్తారు. ఆయన్ను పార్టీ నుంచి తొలగిస్తారా! ఎంపీ పదవి ఊడిపోయేలా నిర్ణయం తీసుకుంటారా అనే దానిపై ఉన్న అన్ని మార్గాలను వైసీపీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.



