టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాటల మాంత్రికుడు. ఉద్యమంలో తనదైన పంథాలో నడిపించిన నాయకుడు. ఒక్కమాట చాలు.. అప్పటి వరకూ కేసీఆర్ అంటే వ్యతిరేకించే గొంతులు సైతం జై కొడతాయి. యాస,భాష అన్నింటా తనదైన ప్రత్యేకత ఉంటుంది. రాజకీయ ఎత్తులు.. వ్యూహాల్లోనూ ఆయన దిట్ట. అపజయం అనుకునే సమయంలో చక్రం తిప్పి తెలివిగా విజయాన్ని తన ఇలాఖాలో బంధీ చేయగల సమర్థుడు. ఇవన్నీ టీఆర్ ఎస్‌లో కేసీఆర్‌పై ఉన్న బలమైన నమ్మకం. ఆయన నాయకత్వంపై విశ్వాసం ఉండటం వల్లనే 2014-18 వరకూ ఎన్ని వివాదాలు వచ్చినా కేసీఆర్‌కే పట్టంకట్టారు తెలంగాణ ప్రజలు. 2023 నాటికి ప్రచారం చేయకుండానే గులాబీజెండా ఎగురవేయాలనే ఉద్దేశంలో సంక్షేమం, అభివృద్ధిని రెండుకళ్లుగా నడిపిస్తున్నారు. పేరుకు కేసీఆర్ సీఎం అయినా కేటీఆర్ కనుసన్నల్లోనే పార్టీ, పాలన సాగుతుంది. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కూడా దాదాపు ఇదే భావనలో ఉంటున్నారు. కొందరైతే.. సీఎం అయేందుకు కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకే. యువనేత సారథ్యంలో కుర్రకారుకే స్థానం కల్పించాలనే ఉద్దేశంతో సీనియర్లను పక్కనబెడుతున్నారనేగుసగుసలూ లేకపోలేదు.. గత ఎన్నికలకు ముందు సీనియర్ నే డి.శ్రీనివాస్‌ను పక్కకు పంపారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ స్వయంగా కవిత ఉత్తరం రాయటం సంచలనంగా మారింది. అంతకముందే మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డికి ఉద్వాసన పలికారు. 2018 ఎన్నికల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని నాయిని భావించారు. కనీసం తన మేనల్లుడు శ్రీనివాసరెడ్డికి సీటివ్వమని అడిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన రెడ్లకు స్థానం లేకుండా పోయిందంటూ కాస్త ఆవేదన కూడా వెలిబుచ్చారు. ఇకపోతే ఖమ్మంలో చక్రం తిప్పిన తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇంటికే పరిమితమయ్యారు. ఇకపోతే స్వామిగౌడ్ తనకు అన్యాయం జరిగిందంటూ ఆక్రోశం వెళ్లగక్కుతూనే ఉన్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఎటుచూసినా రాజకీయాల్లోనూ సీనియర్లకు రిటైర్‌మెంట్ ఉండాలనే నిబందనను కేసీఆర్ ఖచ్చితంగా అమలు చేస్తున్నారంటూ టీఆర్ ఎస్ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయట. ఈ లెక్కన మున్ముందు ఇంకెంతమంది సీనియర్లను ఇంటికి సాగనంపుతారనేది చర్చనీయాంశంగా మారిందన్నమాట.



