ష‌ర్మిల‌క్క తెలంగానం… ఆల‌కించండి జ‌నులారా!

హేమిటో ఈ లాజిక్కులు.. ఒక్క ప‌ట్టాన అర్ధం కావు. తెలంగాణ గాంధీగా పేరున్న కేసీఆర్ ఎక్క‌డ పుట్టిండు. రాముల‌మ్మ‌ది కూడా ఇదే ప్రాంత‌మా! అస్స‌లు మీరేవరు నా లోక‌ల్ గురించి మాట్లాడేందుకంటూ జ‌గ‌న‌న్న బాణం ష‌ర్మిల‌క్క గ‌ట్టిగానే నిల‌దీస్ ఫైట్ చేస్తోంది. నిజ‌మే… అస్సలు కేసీఆర్ , విజ‌య‌శాంతి పుట్టింది ఆంధ్రాలో కాదా! కేటీఆర్ పెళ్లి చేసుకున్న‌ది గుంటూరు అమ్మాయిని కాదా.. కేసీఆర్ కోడ‌లిది తెలంగాణ అయితే.. అనిల్‌కుమార్‌ను చేసుకున్న తాను కూడా అచ్చ‌తెలుగు తెలంగాణ కోడిలేనంటూ ఎంచ‌క్కా స్వీట్ కౌంట‌ర్లు ఇస్తోంది రాజ‌న్న‌రాజ్యం వార‌ధి ష‌ర్మిల‌. ఇంత‌కీ.. ష‌ర్మిల పార్టీ ఏర్పాటు వెనుక‌.. విదేశీ నిధులు కుమ్మ‌రించే సంస్థ‌లు ఉన్నాయనే వాద‌న కొత్త‌గా తెర‌మీద‌కు వ‌చ్చింది. క్రైస్త‌వ ప్ర‌చార‌కుడుగా బ్ర‌ద‌ర్ అనిల్‌కుమార్ గ‌ట్టిగానే నిధులు సేక‌రిస్తున్నార‌ట‌. ఇప్పుడు వాటితోనే పార్టీకు శ్రీకారం చుడుతున్నార‌ట‌. దీనికి క్రైస్త‌వులు, రెడ్డి వ‌ర్గ మ‌ద్ద‌తు కూడా మొదలైంద‌ట‌. రెడ్డి సామాజిక‌వ‌ర్గ సంఘాలు తమ‌కు కేసీఆర్ అన్యాయం చేస్తున్నాడ‌ని.. కాబ‌ట్టే.. త‌మ‌కూ ఒక రెడ్డిపార్టీ కావ‌లంటూ ష‌ర్మిల పంచ‌న చేరుతున్నారు. గ‌తంలో వైఎస్సార్ కూడా రెడ్డి కాంగ్రెస్‌తో హ‌స్తం పార్టీను భ‌య‌పెట్టి చివ‌ర‌కు తాను కూడా అందులో ముక్క‌నేనంటూ పార్టీను క‌లిపేశారు. ఇప్పుడు అదే బాట‌లో అస‌లు సిస‌లైన వైఎస్ వార‌సురాలు ష‌ర్మిల కూడా కొత్త పార్టీతో తెలంగాణ‌లో రాజ‌కీయ చీలిక‌లు, కుల పోరాటానికి తెర లేపిన‌ట్ట‌యింది. తెలంగాణ వ్య‌తిరేక కుటుంబంగా ముద్ర‌ప‌డిన వైఎస్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన ష‌ర్మిల త‌న‌కు తెలంగాణ వ్య‌తిరేక సెగ త‌గ‌ల‌కుండా బాగానే కౌంట‌ర్ ఇచ్చింది. తాను తెలంగాణ కోడలినంటోంది. ఇంత‌కీ.. తాను పార్టీ పెట్ట‌డం వెనుక అస‌లు విష‌యం ఏమిటో చెప్ప‌క‌నే చెప్పింది.

జ‌గ‌న్ జైలులో ఉన్న‌పుడు అన్న త‌ర‌పున ఓదార్పుయాత్ర‌లో వేలాది కిలోమీటర్లు న‌డిచింది ష‌ర్మిల‌. మోకాళ్ల‌కు ఆప‌రేష‌న్ కూడా చేయించుకునేంత‌గా క‌ష్ట‌ప‌డింది కూడా. కానీ.. అన్న‌కే ఆ క‌ష్టం తెలియ‌లేదట‌. అయినా తామ‌న్నా.. త‌మ బంధువుల‌న్నా అన్న‌కు న‌చ్చ‌ట్లేదంటూ మ‌రీ గీరాలు పోతుంద‌టామె. అప్ప‌ట్లో చంద్ర‌బాబు త‌న మంత్రివ‌ర్గంలో కేసీఆర్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌టం వ‌ల్ల కొత్త పార్టీ పుట్టింది. ఇప్పుడు జ‌గ‌న్ అన్న కూడా బాబు లెక్క‌నే చెల్లెమ్మ‌కు నామినేటెడ్ ప‌ద‌వి కూడా క‌ట్ట‌బెట్ట‌క పోవ‌టం వ‌ల్ల‌నే కొత్త పార్టీ వ‌చ్చిందంటూ ష‌ర్మిల ప‌రోక్షంగానే చెప్పుకోచ్చారు. ఏమైనా ష‌ర్మిల కొద్దిరోజులుగా వ‌రుస‌గా తెలంగాణ విద్యార్థి సంఘాలు, నేత‌లు, కుల‌, మ‌త సంఘాల‌తో స‌మావేశాలు తెలంగాణ‌లో రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నాయి. రాజ‌కీయ నిరుద్యోగులు కూడా ఒక్కోక‌రే ష‌ర్మిల‌మ్మ వ‌ద్ద‌కెళ్లి త‌మ బెర్త్ క‌న్‌ఫామ్ చేసుకునే ప‌నిలో కూడా ప‌డ్డారు. మ‌రో వైపు వైఎస్ హ‌యాంలో ఒక వెలుగు వెలిగిన నేత‌లు, బ్యూరోక్రాట్లు కూడా.. గుట్టుగా ష‌ర్మిల వ‌ద్ద‌కెళ్లి ఒక న‌మ‌స్కారం ప‌డేసి వ‌స్తున్నార‌ట‌.

Previous articleమెగాస్టార్‌తో కృష్ణ‌వంశీ రైతు?
Next articleబొమ్మ‌ప‌డింది.. బాక్సాఫీసు నిండింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here