వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బెటర్… ఏదైనా చూడన్నా అంటే వదిలేసేవాడు. అబ్బో.. జగన్ మోహన్‌రెడ్డి అలా కాదు. వరుసబెట్టి మరీ తోలు తీస్తున్నాడు. తప్పు చేసినవాళ్లు తనవాళ్లైనా వదలట్లేదనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మాజీ నేతల్లో ఒక రకంగా వణకు మొదలైందంటూ వైసీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. నిజమే.. జగన్ సీఎం అయ్యాక చేసిన స్పష్టమైన ప్రకటన… తప్పు చేసిన వారు నా వాళ్లైనా ఊచలు లెక్కబెట్టేలా చేస్తాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఆ నాడే సెలవిచ్చారు. 2014-18 వరకూ తెలుగుదేశం పార్టీ ఏలుబడిలో జరిగిన కుంభకోణాలు, దోపిడీలను ఒక్కోకటిగా వెలికి తీసే పనిలో పడ్డారు. మొదట… నాటి స్పీకర్ కోడెల శివప్రసాద్ అండ్ వారసులు కలసి పల్నాడులో సాగించిన దారుణాలు.. వసూళ్లు. కే ట్యాక్స్ అంటూ ఎంత బరితెగించారనే విషయాలు బయటకు వచ్చాయి. రాజకీయంగా ఉన్నతంగా ఎదిగి.. పల్నాటిసింహంగా పేరు పొందిన కోడెల వారసులు చేసిన తప్పుడు పనులకు భంగపడ్డారు. అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మరణించారు.
అచ్చెన్నాయుడు. బీసీ నేత.. గత సర్కారులో అమాత్యులు. ఉత్తరాంధ్రలో కీలకమైన నాయకుడు. ఈయన గారు కూడా ఈఎస్ ఐ స్కామ్‌లో జైలుకెళ్లాచ్చారు. మరో మాజీ మంత్రి హత్యానేరంలో బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇలా.. విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లోని తెలుగు తమ్ముళ్లపై పలు కేసులు నమోదయ్యాయి. గత జన్మభూమి కమిటీల్లో కోట్లు కూడబెట్టిన వారికి ఇప్పుడే భయం మొదలైందట. నాయకులు అయ్యాక.. చివరగా కమిటీల ప్రతినిధులే ఉంటారనే ప్రచారంతో చాలా మంది తమ్ముళ్లు సొంతూళ్ల నుంచి మకాం మార్చేశారట. కొండలు, గుట్టలు మింగేసిన కొందరు ఏకంగా బెంగళూరు, హైదరాబాద్‌లో అజ్ఞాతవాసంలో ఉన్నారట. ఇప్పుడు అదే దారిలో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై సీబీఐ కేసు నమోదు చేసింది. 13 మంది బినామీలతో సుమారు 1.50లక్షల టన్నుల మైనింగ్ అక్రమంగా రవాణా చేసినట్టు ప్రాథమిక అంచనా. తాజాగా యరపతినేనికి సంబంధించిన సుమారు 25 ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించారు. కీలకమైన సమాచారం, సెల్‌పోన్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారట. ఇప్పటికే చింతమనేని జైలుకెళ్లొచ్చారు. యరపతినేని లైన్లో ఉన్నారు. మిగిలింది… దేవినేని అనే ప్రచారం జోరుగా సాగుతోంది. పెద్ద పెద్ద నేతలకే జైలు ఊచలు తప్పట్లేదు.. మేమంత అనే ధోరణిలో తెలుగు తమ్ముళ్లు తెగ భయపడిపోతున్నారట.



