ఏదీ నిన్నటి దూకుడు. ఎటుపోయింది. మొన్నటి పోరాటం. ఇంతలో ఎందుకింత మార్పు. తెర వెనుక ఏం జరిగింది. ఢిల్లీ పెద్దలు ఏమైనా చెప్పారా! లేకపోతే తానే ఉపయోగంలేని ఉద్యమాలు ఎందుకనే మౌనం వహించారా! ఇదంతా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై వస్తున్న కామెంట్స్. తెలంగాణలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కమలం బాస్ బండి సంజయ్ దూకుడుతో జనానికి చేరువయ్యారు. వరుస ఎన్నికల్లో తానేమిటో సత్తా చాటారు. బీజేపీకు 2023కు ఒక హోప్ ఉందనే సంకేతాన్ని పంపారు. టీఆర్ ఎస్ గుండెల్లో దడ పుట్టించారు. మరి ఏపీలో వైసీపీ పట్ల జనమంతా సానుకూలంగా ఉన్నారా! అంటే.. అబ్బే అంత సీన్లేదనే మాటలు వినిపిస్తాయి. వైసీపీ సర్కారు కూడా ఒక కులానికి.. మతానికి ప్రాధాన్యత ఇవ్వటంపై ఏపీ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీన్ని ఒకేచోటికి తీసుకువచ్చేందుకు బీజేపీ మొదట్లో ఉద్యమం చేసింది. దేవాలయాలు, విగ్రహాల విధ్వంసంపై అప్పట్లో గట్టిగానే పోరాడారు. హిందువుల నుంచి కూడా మంచి స్పందన లభించింది. బీజేపీ కూడా ఏపీలో పునాది వేసుకుంటుందనే అభిప్రాయం బలపడింది. కానీ.. ఇంతలో సోమన్నకు ఏమైందో.. ఏపీ సర్కారును మాట అనేందుకు వెనుకాడుతున్నారు.
ఇదంతా కానీ.. అమరావతి రాజధాని పట్ల బీజేపీ నేతలు తలో మాట మాట్లాడుతున్నారు. సోమువీర్రాజు మాత్రం.. మొదటి నుంచి చెప్పిన మాటకే కట్టుబడ్డారు. కానీ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి కూడా మూడు రాజధానుల అంశంపై ఏదోఒక స్పష్టత ఇప్పించటం ద్వారా సోమన్న జనం మనసు గెలిచే అవకాశం ఉంది. జగన్ ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర
మంత్రులను కలిశారు. మూడు రాజధానులు, పోలవరం అంశాలపై చర్చించారనేది సమాచారం. బీజేపీ రాజకీయంగా ముందుచూపుతో ఆలోచిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీలు.. భవిష్యత్‌లో తమకు ఉపయోగపడే ప్రాంతీయపార్టీలకే మద్దతు చెబుతుంది. రాష్ట్రంలో వారితో వ్యతిరేకత ఉన్నా.. ఉన్నతస్థాయిలో మాత్రం వారితో మైత్రి కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో రాష్ట్ర నేతలు చేసిన విమర్శలకు ప్రత్యర్థి పార్టీలు సరిగా పట్టించుకోవట్లేదు. వీళ్లేంటి.. మేం పై స్థాయిలో చూసుకుంటామనే ధీమా కూడా వారిలో ఉంది. అందుకే.. ఇప్పటి వరకూ కేసీఆర్; జగన్ బీజేపీ నేతలను గట్టిగా విమర్శించిన ఆనవాళ్లు కనిపించవు. ఈ లెక్కన సోమన్న సెలెన్స్ వెనుక.. పార్టీ పెద్దల ఆదేశాలు ఉండే ఉంటాయనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.



