బ‌ల్దియా బ‌రిలో బండి త‌గ్గేలా లేడుగా!

బ‌ల్దియా ఎన్నిక‌ల్లో నువ్వా.. నేనా అనేంత బీజేపీ, టీఆర్ ఎస్ ఢీకొడుతున్నాయి. దుబ్బాక గెలుపు త‌రువాత మారిన పాజిటివ్ వాతావ‌ర‌ణాన్ని అనువుగా వాడుకోవాల‌ని బీజేపీ భావించింది. దానికి త‌గిన‌ట్టుగానే బండి సంజ‌య్ మొద‌టి నుంచి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చారు. హైద‌రాబాద్‌లో అక్ర‌మంగా ఉన్న రోహింగ్యాలు, పాకిస్తానీయుల‌ను పార‌దోలేందుకు పాత‌బ‌స్తీపై స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్ చేస్తామంటూ చేసిన సంచ‌ల‌న ప్ర‌సంగంతో ఒక్కసారిగా ఎన్నికల ప్ర‌చారం మ‌రింత వేడెక్కింది. దీనికి ప్ర‌తిగా ఎంఐఎం నేత ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఎన్టీఆర్‌, పీవీ స‌మాదుల‌ను ప‌గుల‌గొడ‌తామంటూ రివ‌ర్స్ కామెంట్స్ చేయ‌టంతో మ‌రింత హీట్‌ను పెంచాయి. దీనిపై టీఆర్ ఎస్ ధీటుగానే స‌మాధాన‌మిచ్చింది. రెండు పార్టీల‌వి పిచ్చి ప్రేలాప‌న‌లుగా మంత్రి కేటీఆర్ ధ్వ‌జ మెత్తారు. ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంద‌నే నేప‌థ్యంలో పోలీసు యంత్రాంగం సిద్ధ‌మైంది. బండి సంజ‌య్‌, అక్బ‌రుద్దీన్ ఇద్ద‌రిపై ఎస్ ఆర్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో కేసులు న‌మోదు చేశారు. దీనిపై బండి స్పందించారు. త‌న‌పై ఎన్ని కేసులు పెట్టినా త‌గ్గేది లేదంటూ స‌వాల్ విసిరారు. బీజేపీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ భ‌య‌ప‌డ‌దంటూ తేల్చిచెప్పారు. పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ మాట‌ల యుద్ధం మ‌రింత పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే పోలీసు యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. ఎటువంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు త‌లెత్త‌కుండా ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో పోలింగ్ జ‌రిగేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here