ఇంటర్నేషనల్ సిటీ.. అంతటా పేద్ద పేరు. కానీ రాత్రయితే చాలు గంజాయిమత్తులో ఊగుతూ దాడులకు తెగబడుతున్నారు. తెల్లవార్లూ రోడ్లమీద బైక్‌లు, కార్లలో చక్కర్లు కొడుతూ హల్‌చల్ చేస్తున్నారు. అంబర్‌పేట్ వద్ద అలీకేఫ్ చౌరస్తా వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటాక. కొందరు కుర్రాళ్లు గంజాయి మత్తులో ఎంత దారుణానికి తెగబడ్డారో సీసీ కెమెరాలు చూస్తే అర్ధమవుతుంది. దాదాపు అరగంట సేపు వాళ్లు రాళ్లు.. రప్పలు విసురుకుంటూ వీరంగం సృష్టించారు. వీరి ఆగడాలను కట్టడి చేసేందుకు ఎవరూ సాహసించలేకపోతున్నారు. ఇది ఒక్క అంబర్‌పేటలోనే కాదు.. గచ్చిబౌలి, మాదాపూర్, టోలిచౌకి, మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్, పాతబస్తీలో మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. కరోనా భయంతో పోలీసులు కూడా ఆచితూచి స్పందించటంతో పోకిరీలకు మరిం రెక్కలు వచ్చినట్టయింది. దీనికి ఇప్పుడే అడ్డుకట్ట వేయకపోతే పట్టపగలు కూడా మత్తుబాబు బరితెగిస్తారని నగర ప్రజలు భయపడుతున్నారు.