సేమ్ టు సేమ్ అదే స్ట్రాటజీ. చంద్రబాబును నాడు దుమ్మెత్తిపోసిన జగన్ మోహన్‌రెడ్డి ఇప్పుడు అదే బాబు ను అనుకరిస్తున్నాడు. పాలనలో అనుకోకండీ. ఎందుకంటే.. అక్కడ మా వాళ్లు అనే ముద్రలో ఇద్దరూ ఎవరికి తీసుపోరు. బాబు ఉన్నపుడు కమ్మవారు. జగన్ వచ్చాక రెడ్డిగారు అనేట్టుగా.. పార్టీలు మారింది తప్ప.. అదే కుల ప్రాధాన్యత తగ్గలేదనేది తెలుస్తూనే ఉంది. ఇదంతా మా మాట కాదండోయ్.. చంద్రబాబును చూశారా.. బీసీలంటూ దొంగ ఏడుపులు. కాపులంటూ బూటకపు ప్రేమలు ఒలకబోస్తాడంటూ ఆ నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ తెగ ఆరోపణలు చేసింది. మేం కానీ.. అధికారంలోకి వస్తే. అన్ని కులాలను పక్కనే కూర్చోబెట్టుకుంటామనేంతగా హామీలు గుప్పించారు. నిజమేనేమో అనుకున్నారంతా..
కానీ అధికారం వచ్చాక.. సలహాదారులుగా రెడ్లు.. నామినేటెడ్ పోస్టుల్లోనూ అదే రెడ్డి సామాజికవర్గం.. అందాకా ఎందుకు.. పేరుకే తాము మంత్రులని.. ప్రతిదీ విజయ సాయిరెడ్డి నుంచి ఆదేశం రావాల్సిందేనంటూ నెత్తీనోరు కొట్టుకుంటున్న వారూ లేకపోలేదు. అంతేలే.. రేపు జనసేన వస్తే.. కాపులకు భుజం కాస్తాడేమో అనేవారూ లేకపోలేదు. కులమేరా అన్నిటికీ మూలం… కులం విలువ తెలుసుకుని నెత్తిన పెట్టుకోవటమే అధికారానికి పరమార్థం అనుకుంటూ సగటు ఏపీ పౌరుడు 2024 వరకూ నెట్టుకురావాల్సిందే. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే..!
టీడీపీ హయాంలో చంద్రబాబు మాంచి కిక్ ఇచ్చే గేమ్ షోతో భలే ఆకట్టుకునేవాడు. ప్రతిపక్షంలో ఉన్న నేతలను విమర్శించేందుకు అదే సామాజికవర్గానికి చెందిన నేతలతో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసేవారు. పవన్‌పై బూతు పురాణం విప్పాలంటే ఓన్లీ ఒన్ బోండా ఉమా.. కాగితం వెంకట్రావు.. నారాయణ వంటి వారు రంగంలోకి దిగేవారు. రెడ్ల కోసం పేద్ద జాబితానే ఉంది. కమ్మవారి పైకి దేవినేని ఉమా, కేశినేని నాని , చింతమనేని , దూళిపాళ్ల నరేంద్ర వంటి వాళ్లు తొడకొట్టేవారు. ఇప్పుడు.. జగన్ ఇలాఖాలో కూడా.. దేవినేని ఉమా మహేశ్వరరావును విమర్శించేందుకు కొడాలి నాని, వసంత కృష్ణప్రసాద్, వల్లభనేని వంశీ అండ్ బ్యాచ్ రెఢీగా ఉంచుతారు. జనసేనానిపై ఆరోపణలు.. కౌంటర్లకు అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి కీలక నేతలు కూడా అపుడపుడూ తెరమీదకు వచ్చి తిట్టిపోస్తుంటారు. ఎస్సీ నేతల కోసం అప్పుడు వర్ల రామయ్య రంగంలోకిదిగితే. ఇప్పుడు ఎంపీ నందిగం సురేష్, తాడికొండ శ్రీదేవి.. ఇలా అదే వర్గ నేతలు ప్రత్యారోపణలతో విరుచుకు పడుతున్నారు.



