వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. సీఎంగా బాధ్యతలు చేపట్టాక టీడీపీ నేతలు లైట్ గా తీసుకున్నారు. ఐదేళ్లు.. ఇట్టే గడచిపోతాయని లెక్కలు కట్టుకున్నారు. సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాలంటూ మళ్లీ యాత్రలతో జనంలో తిరుగుతాడు. రాజకీయాల జోలికి రాడనే అంచనాలు వేసుకున్నారు. కానీ.. జగన్.. ధనాధన్ అన్నట్టుగా బుల్లెట్‌లో దూసుకొచ్చి ప్రతిపక్ష టీడీపీ వెన్నులో వణపు పుట్టిస్తాడని ఊహించలేకపోయారు. నన్నెవరూ ఏం చేయలేరురా! అంటూ తొడలు కొట్టి జబ్బలు చరిచిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాత కేసులు తిరగదోడారు. బాధితులు ధైర్యంగా బయటకు వచ్చారు. అంతే.. వరుస కేసులతో జైలు ఊచలు లెక్కబెట్టేంత వరకూ చేరారు. ఇప్పుడాయన శాంతమూర్తిగా మారారట. బాబోయ్ ఈ రాజకీయాలు నా వల్ల కాదు.. ఏదో నా ఫామ్‌హౌస్‌లో బర్రెల మధ్యనే హాయిగా ఉందంటూ సేదతీరుతున్నారట. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈ ఎస్ ఐ స్కామ్‌లో అరెస్ట్ చేశారు. రోజుల తరబడి ఆసుపత్రి, జైళ్ల చుట్టూ తిరిగి బొమ్మ కనిపించిందట. ఇలా.. జేసీ బ్రదర్స్ కూడా వామ్మో.. జగన్ కంటే వాళ్ల నాన్న వైఎస్సే బెటర్ అనేంత వరకూ చేరారు. చివరకు జేసీ ప్రభాకర్‌రెడ్డి .. జగన్ మావాడేనంటూ తీర్మానం చేసి బతుకుజీవుడా అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. యరపతినేని చుట్టూ ఎట్టాగూ సీబీఐ కేసు ఉండనే ఉంది. కేశినేని మౌనం వహించారు. ప్రత్తిపాటి పుల్లారావు అసలు టీడీపీలో ఉన్నాడా అనే అనుమానం కలుగుతుంది.
టీడీపీ అంటేనే గుర్తొచ్చే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాజీ మంత్రులు, తొడకొట్టి కమాన్ జగన్ అంటూ ఈల వేసిన దేవినేని వంటి వారు కూడా అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. తాజాగా సీఐడీ కేసు మెడకు చిక్కుకున్న దేవినేని పైకి మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్నా.. జైలు ఊచలు తప్పవేమోననే ఊగిసలాటలో ఉన్నారట. ఇప్పుడు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర.. సంగం డైరీలో జరిగిన అవకతవకలు, అవినీతిపై ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఊహించని షాక్‌తో టీడీపీ శ్రేణులు కకావికలమయ్యాయట. కొద్దిరోజులు ప్రశాంతంగా ఉన్నట్టుగా కనిపించిన వైసీపీ అధినేత జగన్ వ్యూహంతో టీడీపీ నేతలు అజ్ఙాతంలోకి వెళ్తున్నారట. ప్స్.. పాపం ఏమైనా.. చేసిన తప్పులు వెంటాడతాయంటే ఇదేనేమో అనుకుంటున్నారు. 2024 కూడా మాదే పవర్ అనే వైసీపీకు ప్రతికూలంగా టీడీపీ అధికారంలోకి వస్తే.. టీడీపీ నేతలున్న స్థానంలో వైసీపీ మాజీలుంటారంటూ సామాన్యులు సెటైర్లు వేసుకుంటున్నారట.



